రాత్రి కరెంట్‌కు మహిళా రైతు బలి

26 October 2026 - 12:08
0 0
రాత్రి కరెంట్‌కు మహిళా రైతు బలి
07
  • పొలంలో వైర్లు సరిచేస్తుండగా విద్యుత్తు షాక్‌
  • వరంగల్‌ జిల్లా గుడితండాలో విషాదం

నర్సంపేట, అక్టోబర్‌ 25 : రాత్రి కరెంట్‌కు ఓ మహిళా కౌలు రైతు బలైంది. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చే కరెంట్‌ కోసం ముందస్తుగా విద్యుత్తు వైర్లు, పైపులను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ప్రాణాలు వదిలింది. స్థానికుల కథనం మేరకు.. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుడితండాకు చెందిన భూక్యా మంగమ్మ (38), శ్రీనివాస్‌ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

వీరు ఇటీవల నాజీతండా శివారులో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరంలో వరి, మిగిలిన ఎకరన్నరలో పత్తి, మిర్చి సాగు చేశారు. వరిపొలానికి నీరు పెట్టేందుకు సమీపంలోని ఓ రైతుకు చెందిన బోరును అద్దెకు తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం మంగమ్మ పొలం వద్దకు వెళ్లి మోటర్‌పైపులతోపాటు కరెంటు వైర్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె విద్యుత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామ్మోహన్‌ తెలిపారు.

Comments (0)

User