Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు

26 October 2026 - 12:08
0 0
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
Hmda

Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్‌ 25 (నమస్తే తెలంగాణ): హెచ్‌ఎండీఏ మరోసారి భారీ భూముల వేలానికి తెరలేపింది. నగరంలోని అత్యంత ఖరీదైన, ప్రైమ్‌ లొకేషన్లలో ఉన్న భూములను అమ్మి ఏకంగా రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్‌ నెలాఖరున ఈ వేలం ప్రక్రియను నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గతంలో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. ఇదే జోరును కొనసాగిస్తూ, ఇప్పుడు హెచ్‌ఎండీఏ కూడా రంగంలోకి దిగింది. ప్రధానంగా కోకాపేట్‌లోని ‘నియోపొలీస్‌’ (Neopolis) లేఅవుట్‌తో పాటు పలు ప్రాంతాల్లోని మొత్తం 114 భూ పార్శిళ్లను వేలం వేయనున్నారు.

బంజారాహిల్స్‌ భూముల వేలం!

బంజారాహిల్స్‌లోని హకీంపేట్‌ గ్రామం (సర్వే నెం. 102/1)లో వివాదాస్పదంగా మారిన భూములనూ వేలంలో ఉంచారు.. ఈ సర్వే నెంబర్‌లోని భూములపై గతంలో ఓ సొసైటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, హెచ్‌ఎండీఏ వెనక్కి తగ్గడం లేదు. ఇక్కడ 1,084 చదరపు గజాల నుంచి 1,437 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను నోటిఫై చేసింది.

చదరపు గజానికి రూ. 2 లక్షల చొప్పున భారీ రిజర్వ్‌ ధరను నిర్ణయించారు. గత జూన్‌ నోటిఫికేషన్‌లోనూ ఇదే సర్వే నంబర్‌ పరిధిలోని 8 ఎకరాలను ఎకరా రూ. 99 కోట్ల చొప్పున వేలానికి పెట్టాలని భావించారు. అయితే, సొసైటీ సభ్యులు తమ భూములతో ఓవర్‌లాప్‌ అవుతున్నాయని ఆరోపించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా రెవెన్యూ శాఖ ఆరోపణలను తోసిపుచ్చడంతో ప్రభుత్వం మళ్లీ వేలానికి రంగం సిద్ధం చేసింది.

నవంబర్‌ 12 నుంచి వేలం పాటలు

బంజారాహిల్స్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో నోటిఫై చేసిన ప్లాట్లలో అత్యధికంగా చదరపు గజానికి రూ. 55,000, అత్యల్పంగా ఇన్ముల్‌ నర్వ లేఅవుట్‌లో రూ. 15,000 రిజర్వ్‌ ధరను ఖరారు చేశారు. బచపల్లి లేఅవుట్‌లో 50 ప్లాట్లు, ఇన్ముల్‌ నర్వలో 45 ప్లాట్లతో పాటు అమీన్‌పూర్‌, కప్రూ, సూరారం తదితర ప్రాంతాల్లోని భూములను ఈ వేలంలో ఉంచారు. నవంబర్‌ 12, 20, 23, 25, 27 తేదీల్లో ఈ వేలం పాటలు జరగనున్నాయి.

ప్రభుత్వ తీరుపై విమర్శలు..

రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల అమలుకు, అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ భూముల విక్రయాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవడం గమనార్హం. సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌, రోజురోజుకూ ప్రభుత్వ భూములను వేలం వేస్తూ ఖజానా నింపుకునే పద్ధతిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

కోకాపేట్‌, బంజారాహిల్స్‌లో భారీ ధరలు..

కోకాపేట్‌ నియోపొలీస్‌ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల భూమి (ప్లాట్‌ నెం. 17)కి హెచ్‌ఎండీఏ రూ. 120 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించింది. రాయదుర్గం ఖల్సా గ్రామంలోని 1,815 చదరపు గజాల ప్లాటుకు రూ. 1.75 లక్షలు, అలాగే కోకాపేట్‌లోని మరో 8,591 చదరపు గజాల (దాదాపు 2 ఎకరాలు) పార్శిల్‌కు చదరపు గజానికి రూ. 1.50 లక్షల చొప్పున రిజర్వ్‌ ధరను ఫిక్స్‌ చేశారు. కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేట్‌లో 3.15 ఎకరాల స్థలానికి రూ. 99 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించారు.

Comments (0)

User