పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ

హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కరువు ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపైనా ప్రభావం పడే అవకాశం ఉన్నదని పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వీ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. పశుగ్రాసం కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యాధుల ముప్పు, తగ్గే పాల దిగుబడి.. ఇవన్నీ కలిసి పాడి రైతులకు సవాలుగా మారకుండా ముందుగానే పశుసంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజా హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం బలంగా ఏర్పడి కొనసాగుతున్నదని గుర్తుచేశారు.
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన ఎండలు, వర్షాభావం వ్యవసాయంతోపాటు పశుసంపద ఉత్పత్తికి పెను సవాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధిక ఉష్ణోగ్రతలు, తాగునీటి ఎద్దడి, పచ్చిమేత కొరత, దాణా ధరల పెరుగుదల వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతిని పాలు, మాంసం, గుడ్ల ఉత్పాదకత పడిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సుమారు 42.33 లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 1.91 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, దాదాపు 8 కోట్ల కోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఎండ తీవ్రతకు పశువుల శరీర ఉష్ణోగ్రత, శ్వాసరేటు, నీటి అవసరం పెరిగి, మేత తీసుకోవడం తగ్గుతుందని, తద్వారా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి అని సూచించారు.
ఎల్ నినో ప్రభావం డిసెంబర్లో తీవ్రరూపం దాల్చి ఫిబ్రవరిలో మరింత ఉధృతంగా మారే అవకాశాలుంటాయని చెప్పారు. ఎండాకాలంలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతాయని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్లో భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పశుపోషణ, పాడిపరిశ్రమపై ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ వీ లక్ష్మారెడ్డి కీలక సూచనలు చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
పెరుగుతున్న వేడి.. పశువులపై తీవ్ర ప్రభావం
అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో వేడి ఒత్తిడి (హీట్స్ట్రెస్) పెరుగుతుంది. వేడిని తట్టుకునే క్రమంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరుగడంతో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. దీంతో గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకే అవకాశం పెరుగుతుంది. ఎండ తీవ్రత పెరిగినప్పుడు పశువులు సాధారణ స్థాయిలో దాణా తీసుకోలేవు. జీర్ణక్రియ మందగించడం, నీటి వినియోగం పెరుగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. వీటి ప్రభావం నేరుగా పాల ఉత్పత్తిపై పడుతుంది.
పాల దిగుబడిపై వేడి ప్రభావం
వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే పాలిచ్చే ఆవుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని పరిస్థితుల్లో పాల ఉత్పత్తి 10% నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో పాల సేకరణ గణాంకాల్లో తగ్గుదల కనిపిస్తున్నది. విజయ డెయిరీ గణాంకాల ప్రకారం 2024-25లో రోజువారీ సగటు పాల సేకరణ సుమారు నాలుగు లక్షల లీటర్లుగా ఉండగా.. 2025-26లో అది 3.36 లక్షల లీటర్లకు తగ్గింది. అంటే ఏడాది వ్యవధిలో రోజువారీ సగటు పాల సేకరణ సుమారు 64 వేల లీటర్లు తగ్గింది. పాల దిగుబడి తగ్గడం డెయిరీలపైనే కాకుండా పాడి రైతుల ఆదాయంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
పశుగ్రాసం కొరతతో రైతులకు అదనపు భారం
వర్షపాతం తగ్గితే పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. దాణా, పశుగ్రాసం ధరలు పెరిగితే పశువుల పోషణ రైతులకు అదనపు ఆర్థిక భారంగా మారుతుంది. మరోవైపు, పోషకాహారం సరిగా అందకపోతే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి తీవ్రత ప్రారంభం కాకముందే అవసరమైన పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, నీటి వనరులను సిద్ధం చేసుకోవడం కీలకం.
డెయిరీల ఆదాయంపైనా ఒత్తిడి
పాల సేకరణ తగ్గుతున్న నేపథ్యంలో డెయిరీల ఆదాయంపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు దెబ్బతింటే డెయిరీల నిర్వహణ నుంచి రైతులు వెనక్కి మళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో పశువుల పేడ, మూత్రం వంటి వాటితో సేంద్రియ ఎరువుల తయారీ వంటి వాణిజ్య కార్యకలాపాల ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా రైతులు దృష్టి సారించాలి.
ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు
పాడి పశువుల్లో విదేశీ, సంకరజాతి ఆవులు 24 నుంచి 27 డిగ్రీల సెల్సియస్, దేశీ ఆవులు 33 డిగ్రీలు, బర్రెలు 36 డిగ్రీల ఉష్ణోగ్రత మించితే వేడి ఒత్తిడికి గురవుతాయి. శరీరాన్ని చల్లబరచుకోవటానికే చాలా శక్తి ఖర్చయి పోతుంది. మేత మేయడం తగ్గడంతో పాల దిగుబడితోపాటు పాలలో వెన్న, ప్రొటీన్ శాతం తగ్గుతుంది. గొర్రెలు, మేకలు, పందులు పచ్చిగడ్డి, మేత కొరతతో జీవాల బరువు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. అధిక వేడిని తట్టుకోలేని పందుల్లో ఎదుగుదల, పునరుత్పత్తి దారుణంగా క్షీణిస్తుంది. దేశం గుడ్ల ఉత్పత్తిలో 13% వాటా ఉన్న తెలంగాణలో కోళ్ల మేత అధికంగా వేయాల్సి ఉం టుంది. గుడ్ల ఉత్పత్తి, నాణ్యత, పొదిగే సామ ర్థ్యం తగ్గుతాయి. చేపల చెరువుల్లో నీటిమట్టా లు పడిపోయి నాణ్యత దెబ్బతింటుంది. వేడి తీవ్రత వల్ల పశువుల్లో ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు. చూడి నిలిచే సామర్థ్యం తగ్గి, ఈతల మధ్య కాలం పెరుగుతుంది. మగ పశువుల్లో వీర్యం నాణ్యత తగ్గుతుంది. రోగనిరోధకశక్తి తగ్గి పొదుగువాపు, గాలికుంటు, పీపీఆర్, కొకెర వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని పశువైద్యులు తెలిపారు.
పాడి పశువుల పోషణ కోసం యజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
పాడి పశువులకు పాకల చుట్టూ గోనె సంచులు కట్టి రోజుకు 2-3 సార్లు తడపాలి. పైకప్పుపై కూలింగ్ పెయింట్ వేయడం ద్వారా 95% ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. పైకప్పుపై గడ్డి లేదా కొబ్బరి/తాటి ఆకులు పరవాలి. షెడ్లలో స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు, చుట్టూ 20% షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలి. సాధారణంగానే దాణా, మేత కొరత ఉన్నందున ముందస్తుగా ‘సైలేజ్’ (పాతరగడ్డి) రూపంలో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ గడ్డి బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. పశుగ్రాసాన్ని చాఫ్ కట్టర్తో చిన్న ముకలుగా కత్తిరించి వృథాను అరికట్టాలి. పీచు మేతను తగ్గించి, ఉదయం-సాయంత్రం వేళల్లోనే మేపాలి. జీవాలను ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలోనే మేతకు పంపాలి.
కరువు పరిస్థితులను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలు ఏమిటి?
కరువును తట్టుకునే తెలంగాణ ఫాడర్ బజ్రా (టీఎస్ఎఫ్బీ 15-4, 15-8, మోతి బజ్రా), తెలంగాణ జొన్న (సీఎస్వీ-41), హెడ్జ్ లూసర్న్ (టీఎస్హెచ్ఎల్-1) వంటి రకాలను సాగు చేయాలి. పాల ఉత్పత్తి తగ్గకుండా పశువైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన ఖనిజ లవణ మిశ్రమం (టెల్మిన్)ను రోజుకు 50-100 గ్రాములు, కేజీ దాణాకు 0.5-1 గ్రాము బిటైన్ కలిపి ఇవ్వాలి. టన్ను కోళ్ల దాణాలో 100 గ్రాముల విటమిన్-సీ, 50 గ్రాముల విటమిన్-ఇ వాడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెలంగాణలో పశుసంపద 90 లక్షల వరకు ఆవులు, బర్రెలు, రెండున్నర కోట్లకుపైగా గొర్రెలు, మేకలు, కోట్ల సంఖ్యలో కోళ్లు ఉన్నాయి. ఈ పశుసంపదకు కనీసం ఏటా రెండు కోట్ల టన్నులకుపైగా గడ్డి అవసరం. సాధారణ పరిస్థితుల్లోనే 30 శాతానికిపైగా గడ్డి కొరత ఉంటుందన్న అంచనాలున్నాయి. ఎల్ నినోతో ఈ కొరత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. తద్వారా పశుపోషణ భారంగా మారుతుందనే భయం పాడిరైతుల్లో కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పాడి రైతులు భయపడాల్సిన అవసరమేమీ ఉందు. అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ఎల్ నినోను సులువుగా ఎదురోవచ్చు. అటు పశువుల జీవితాలకు, పాడి రైతు ఆదాయానికి భరోసా కల్పించవచ్చు.
పశుగ్రాసం కొరత వల్ల ఎలాంటి పరిణామాలుంటాయి?
ఆరోగ్యంగా ఉండి 10 లీటర్ల పాలిచ్చే పశువులకు రోజుకు 4 కిలోల దాణా, 25 నుంచి 30 కిలోల పచ్చిగడ్డి, 7 కిలోల వరకు ఎండుగడ్డి అవసరం. అన్ని పశువులకు ఈ మేరకు అవసరం లేకపోయినా పచ్చిగడ్డి కొరత ఏర్పడితే పశువుల్లో పోషకాలు తగ్గిపోతాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. పశు సంపద బలహీనమవుతుంది. దాణా ఎకువ వాడాల్సి వస్తుంది. దాణా రేట్లు పెరుగుతాయి. పోషణ ఖర్చు పెరుగుతుంది. తద్వారా పాల రేట్లు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పశుపోషకులు ఎల్ నినోను ధైర్యంగా ఎదురోవచ్చు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా పశువులను కాపాడుకోవడమే కాకుం డా పోషణ ఖర్చును తగ్గించుకొని ఆదాయాన్ని స్థిరీకరించుకోవచ్చు.
కోళ్ల పరిశ్రమ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఎల్ నినో ప్రభావం కోళ్లపై కూడా ఉంటుంది. ఎండలను కోళ్లు అసలు తట్టుకోలేవు. వాటికి చల్లటి, పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. పశువుల షెడ్ల తరహాలోనే కోళ్లఫారాలకు కూడా గోనె సంచులు కట్టుకోవచ్చు. వేడి తకువగా ఉన్న సమయాల్లోనే మేత ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాడి, కోళ్ల పెంపకం చేపట్టే రైతులకు భరోసా కల్పించాలి. ఇప్పటికే జాతీయ పశుసంపద మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా పశుగ్రాసం యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు 50% సబ్సిడీ అందించే పథకం ఉన్నది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ద్వారా చాలా పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిని రైతులకు అందించేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది.
ఎలాంటి యాజమాన్య చర్యలు అవసరం?
వానకాలం ముగియకముందే తెలంగాణలో పచ్చిగడ్డికి ఇబ్బందులు వస్తున్నాయి. ఎండాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎకువవుతుంది. అందుకోసం పశుపోషకులు మాగుడుగడ్డిని తయారు చేసుకోవాలి. ఎండుగడ్డిని నిల్వ చేసుకోవాలి. జొన్న, మకజొన్న చొప్పలు వేసుకోవాలి. ఖరీదైన దాణాపై ఆధారపడకుండా పాడి పశువుల మేతకు అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు. దాణాను మారెట్లో కొనడం కంటే రైతు తయారు చేసుకోవడమే మంచింది. 10 పశువులున్న రైతు 100 కిలోల దాణా తయారు చేసుకుంటే ఐదు రోజులు వాడుకోవచ్చు. అందుకోసం 30 కిలోల జొన్న, మకజొన్నలు, 30 కిలోల వేరుశనగ, పత్తిచెక, 30 కిలోల వరి, గోధుమ తవుడుతోపాటు 2 కిలోల ఖనిజ లవణ మిశ్రమం, కిలో ఉప్పు కలుపుకొని ఈ దాణా తయారు చేసుకోవచ్చు. ఒకట్రెండు పశువులున్న రైతుకు అయితే ఈ దాణా సుమారు నెలరోజులు వస్తుంది. ఖనిజ లవణ మిశ్రమం కిలో రూ.150 వరకు మారెట్లో ధర పలుకుతున్నది. పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా వారానికి 1,2 తడులు సరిపోయే బహువార్షిక గడ్డిని సాగు చేయాలి. కో-4, కో-5, సూపర్ నేపియర్, ఏపీబీఎన్, బాదిరా నేపియర్ లాంటి రకాల సాగు చేపట్టాలి. ఈ గడ్డి సాగుకు అవసరమైన సాయం మా విశ్వవిద్యాలయం నుంచి అందుతుంది.
Comments (0)