Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?

19 October 2026 - 22:15
0 0
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Bjp Leader Pushes Girl

భోపాల్‌: గర్బా వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన బాలిక పట్ల ఒక బీజేపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను దూషించడంతో పాటు బయటకు తోసివేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ బాలిక ఫిర్యాదుతో ఆ బీజేపీ నేతపై కేసు కూడా నమోదైంది. (BJP leader pushes girl) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఇండోర్‌లోని హీరా నగర్ ప్రాంతంలో ‘కంకేశ్వరి గర్బా ఉత్సవం’ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 15 ఏళ్ల బాలిక అక్కడకు చేరుకున్నది.

కాగా, బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్‌, ఆ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వేదికలోకి ఆమె ప్రవేశించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండాల్‌ నుంచి బయటకు వెళ్లమని చెబుతూ ఆ బాలికను బలవంతంగా నెట్టివేశారు. ప్రతిస్పందించిన ఆమె తనను తాక వద్దని ఆయనను హెచ్చరించింది. అక్కడున్న కొందరు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్‌ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘కంకేశ్వరి గర్బా’ వేదికను సందర్శించారు. కన్యా పూజలో ఆయన పాల్గొనడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో బీజేపీపై కాంగ్రెస్‌ మండిపడింది. ముఖ్యమంత్రి చిన్న బాలికలకు పూజలు చేస్తుంటే, అదే వేదిక వద్ద ఒక మైనర్ బాలిక పట్ల ఆ పార్టీ నేత దురుసుగా ప్రవర్తించడాన్ని విమర్శించింది. ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేసింది.

అయితే ఆ బాలిక కూడా బీజేపీ నేత కమల్ చౌహాన్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు చేపడతామని బీజేపీ పేర్కొంది.

Comments (0)

User