Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!

Jio IPO | భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు! రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) పబ్లిక్ ఇష్యూకు అంతర్జాతీయ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓకు ముందు నిర్వహించిన యాంకర్ బుక్‌లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఒక ఐపీవో యాంకర్ బుక్కు ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మొత్తం రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యంలో భాగంగా యాంకర్ బుక్ ద్వారా రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించేందుకు ఉంచగా.. వాటి కోసం వచ్చిన బిడ్లు అందుబాటులో ఉన్న మొత్తానికి 30 రెట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ స్పందన జియో వ్యాపార వృద్ధిపై సంస్థాగత పెట్టుబడిదారులకు ఉన్న అంచనాలను ప్రతిబింబిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జియో యాంకర్ బుక్‌లో ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం. బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టీ. రో ప్రైస్, ష్రోడర్స్, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో, జానస్ హెండర్సన్ వంటి సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సావరిన్ వెల్త్ ఫండ్లలో సింగపూర్‌కు చెందిన జీఐసీ, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ), నార్వేకు చెందిన నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. విదేశీ లాంగ్-ఓన్లీ ఫండ్లు, సావరిన్ వెల్త్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ల నుంచి వచ్చిన బిడ్లే మొత్తం డిమాండ్‌లో అధిక భాగాన్ని ఆక్రమించినట
దేశీయ మ్యూచువల్ ఫండ్ల పోటీ
భారత్‌లోని టాప్-10 మ్యూచువల్ ఫండ్లలో దాదాపు అన్నీ జియో యాంకర్ బుక్‌లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. బీమా, పెన్షన్ రంగాల నుంచి ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్, హెచ్డీఎఫ్సీ పెన్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థలు కూడా పాల్గొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
యాంకర్ బుక్‌లో భారీ డిమాండ్ నేపథ్యంలో జియో యాజమాన్యం, ఐపీవో నిర్వహిస్తున్న బ్యాంకర్లపై షేర్ల కేటాయింపుల విషయంలో ఒత్తిడి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెద్ద విదేశీ లాంగ్-ఓన్లీ ఫండ్లు, సావరిన్ వెల్త్ ఫండ్లు, దేశీయ మ్యూచువల్ ఫండ్లలో కొన్ని ఒక్కొక్కటి 750 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. ప్రముఖ సంస్థలకు ఒక్కొక్కటికి సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల విలువైన షేర్లు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు, చిన్న మొత్తాల్లో పాల్గొనే అనేక ఫండ్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువైన షేర్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. యాంకర్ బుక్కు సంబంధించిన అధికారిక వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అక్టోబర్ 21న ప్రారంభం కానున్న ఐపీవో
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో అక్టోబర్ 21న ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న ముగుస్తుంది. మొత్తం రూ.30,213 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. జియోకు ఉన్న భారీ వినియోగదారుల సంఖ్య, టెలికాం రంగంలో ఆధిపత్యం, 4జీ నుంచి 5జీ సేవలకు మార్పు, బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైజ్, ఏఐ, డిజిటల్ సేవల్లో వృద్ధి అవకాశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments (0)