AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్

AP Parishad Elections |ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోమవారం ప్రకటించారు. మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై కూడా ఎస్‌ఈసీ పరిమితులు విధించింది. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.8 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం జెడ్పీటీసీ స్థానాలకు 28 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు), ఎంపీటీసీ స్థానాలకు 687 మంది ఆర్‌ఓలను నియమించినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల నోటీసు జారీతోపాటు ఓటర్ల జాబితాను అక్టోబర్ 21న ప్రదర్శించనున్నారు. అదే రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల సమయం కల్పించారు.
అక్టోబర్ 24న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ నామినేషన్లకు సంబంధించిన అప్పీళ్లను రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) వద్ద, జెడ్పీటీసీ నామినేషన్ల అప్పీళ్లను జిల్లా కలెక్టర్ పరిధిలో దాఖలు చేయాలి. అక్టోబర్ 26న అప్పీళ్లను పరిష్కరిస్తారు.
అక్టోబర్ 27న అభ్యర్థుల తుది జాబితా
నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 27 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
నవంబర్ 3న పోలింగ్.. 5న ఫలితాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 3న నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
నవంబర్ 5న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరనుంది.
Comments (0)