సౌదీ, పాక్ మధ్య రక్షణ ఒప్పందం, భారత్‌కు ఇబ్బందికరం..!
భవిష్యత్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ తరహాలో ఏదైనా చర్యలు తీసుకుంటే, పాకిస్తాన్‌తో పాటు సౌదీ అరేబియా కూడా పోరాడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదే ప్రశ్నను సౌదీ అరేబియాకు భారత రాయబారిగా పనిచేసిన తల్మిజ్ అహ్మద్‌ను అడగగా.. '' ప్రస్తుతం భారత్‌కు అంత పెద్ద ఎదురుదెబ్బలాగా కనిపించడం లేదు.
కానీ, మనం దీన్ని దీర్ఘకాలంలో చూసుకుంటే, ఏ విధంగా చూసినా భారత్‌కు అంత మంచిది కాదు'' అని అన్నారు.''పశ్చిమాసియాలో పాకిస్తాన్ చాలా ప్రాధాన్యత గల దేశంగా మారింది. భారత్ ఈ ప్రాంతంలో ఎక్కడా కనిపించడం లేదు. గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం పాకిస్తాన్, తుర్కియే, చైనాల వైపుకు చూస్తున్నాయి.
ఈ ప్రాంతంలో మూడు దేశాలు చాలా ముఖ్యమైనవి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఈ మూడు దేశాలు భారత్‌కు మూకుమ్మడిగా వ్యతిరేకతను ప్రదర్శించాయి. ఇది భారత్‌కు కచ్చితంగా సమస్య అవుతుంది'' అని తల్మిజ్ అహ్మద్ అన్నారు.గత కొన్ని నెలల క్రితమే, భారత్‌తో పాకిస్తాన్ సైనిక ఘర్షణకు తలపడింది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ఒప్పందం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే ముఖ్యమైనదిగా కాకుండా, పశ్చిమాసియా, దక్షిణాసియాలపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.సెప్టెంబర్ 17న పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా వెళ్లారు.''
పాకిస్తాన్ కేవలం సరికొత్త పరస్పర భద్రతా ఒప్పందంపై సంతకం పెట్టడమే కాదు. భారత్‌కు పెద్ద భాగస్వామిగా ఉన్న దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పాకిస్తాన్‌పై దాడి చేయకుండా భారత్‌ను అడ్డుకోదు. కానీ, మూడు శక్తిమంతమైన దేశాలు చైనా, తుర్కియే, పాకిస్తాన్‌లను ఈ విషయంలో ఏకతాటిపైకి తీసుకొస్తుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ కీలకమైన స్థానంలో ఉంది'' అని దక్షిణాసియా భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలించే మైఖేల్ కుగెల్మాన్ అన్నారు.భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ ఒప్పందంపై స్పందించింది.‘‘భారత జాతియ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ శాంతిపై ఈ ఒప్పంద పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై మేం అధ్యయనం చేస్తున్నాం.
జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది'' అని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తన ప్రకటనలో పేర్కొంది.అంటే, జాతి భద్రతపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై భారత్ చర్చిస్తోంది.భారత ప్రధాని మోదీ ఎన్నో ఏళ్లుగా సౌదీ అరేబియాను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ ఫలితమే ఉండటం లేదని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ భావిస్తున్నారు.'' సౌదీ అరేబియాను ఆకర్షించేందుకు మోదీ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ అరేబియాతో తమ సంబంధాలను పెంచుకున్నారు. తరచూ సౌదీ వెళ్లి వస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా సౌదీ అరేబియాలో పర్యటించారు మోదీ. కానీ, మోదీ పుట్టినరోజు సందర్భంగా, సౌదీ యువరాజు మాత్రం ఊహించని షాకిచ్చారు. ప్రస్తుతం సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు దేనిపై ఏ దాడి జరిగినా, రెండింటిపై జరిగిన దాడిగా భావిస్తాయి'' అని బ్రహ్మ చెల్లానీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ అరేబియా నిధులను వాడుకుని అవసరమైనప్పుడు అమెరికా ఆయుధాలను కొనేందుకు వీలుంటుందని అమెరికాకు పాకిస్తాన్ అంబాసిడర్‌గా పనిచేసిన హుస్సేన్ హక్కానీ అన్నారు.1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత కొన్నిరోజుల్లోనే ఇస్లామాబాద్‌లో అప్పటి సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్ పర్యటించారు.
పాకిస్తాన్ అణు, క్షిపణి స్థావరాలను ఆయన సందర్శించారు.ఆ సమయంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. ఆ పర్యటన ఆందోళనకరంగా అనిపించిందని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు.పాకిస్తాన్‌లో ఉన్న అత్యంత రహస్య ప్రదేశంలోకి ఒక విదేశీయుడిని తీసుకెళ్లడం అదే మొదటిసారి.
ఎందుకు సౌదీ మంత్రి పాకిస్తాన్‌లోని కతువాలో ఉన్న యురేనియం శుద్ధి కేంద్రాన్ని, ఘౌరి క్షిపణి కేంద్రాన్ని సందర్శించారో అమెరికాకు కూడా తెలియలేదు. అయితే, సౌదీ అరేబియాగానీ, పాకిస్తాన్‌గానీ దీని వెనకున్న ఉద్దేశ్యాన్ని బయటికి చెప్పలేదు.గల్ఫ్ దేశాల్లో అమెరికాపై ఉన్న అపనమ్మకం పెరుగుతోందని పశ్చిమ మీడియాలో కొందరు అంటున్నారు.
ఫలితంగా ఈ ప్రాంతంలోని దేశాలు భద్రత కోసం పాకిస్తాన్, చైనా, తుర్కియే, ఇతర దేశాల వైపుకు చూస్తున్నాయని చెబుతున్నారు.హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇదే సమయంలో, ఖతార్ సాయంతో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ చర్చలు జరుపుతోంది. ఈ మొత్తం విషయానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది.
ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమాసియాలో భద్రతకు ఎంతోకాలంగా అమెరికా హామీగా ఉంటూ వస్తోంది. కానీ, ఇజ్రాయెల్ దాడులతో అమెరికా పాత్ర బలహీనపడినట్లు కనిపిస్తోంది.
అయితే, భారత్, పాకిస్తాన్‌లు రెండూ అణ్వాయుధ దేశాలు కావడంతో, రెండింటితో సంబంధాలను సమతుల్యంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సౌదీ అరేబియాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు అమెరికా న్యూస్ నెట్‌వర్క్ సీఎన్ఎన్‌తో చెప్పారు.''భారత్‌తో మా సంబంధాలు ప్రస్తుతం ఉన్నంత బలంగా ఎప్పుడూ లేవు.
ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ప్రయత్నిస్తాం. ప్రాంతీయ శాంతి విషయంలో మేం కలిసి పనిచేస్తాం'' అని సీనియర్ సౌదీ అధికారి ఒకరు సీఎన్‌ఎన్‌తో చెప్పారు.