ఇండియా, చైనా కలిసి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గిస్తాయా? భారత్‌కు చైనా మద్దతు...!

Aug 25, 2025 - 10:42
Aug 25, 2025 - 10:43
 0  2
ఇండియా, చైనా కలిసి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గిస్తాయా? భారత్‌కు చైనా మద్దతు...!

చైనా వస్తువులపై అమెరికా 145 శాతం పన్ను విధించింది. అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం పన్ను విధించింది.

ఆ తర్వాత 2025 మేలో జెనీవాలో జరిగిన సమావేశంలో రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంలో భాగంగా సుంకాలను తగ్గించాయి. అయినప్పటికీ రెండు దేశాల మధ్య సుంకాల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

చైనా మరోసారి ఆగస్టు 21న అమెరికాకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. కానీ ఈసారి అది విదేశీ గడ్డపై... భారత్‌లో.

అమెరికాను బెదిరింపులకు పాల్పడే దేశంగా పేర్కొన్న జు ఫీహాంగ్.. ఆ దేశం స్వేచ్ఛా వాణిజ్యం నుంచి అనేక ఏళ్లుగా ప్రయోజనాలు పొందిందని.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి అధిక ధరలను డిమాండ్ చేయడానికి సుంకాలను బేరసారాల సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు.

''భారత్‌పై అమెరికా 50 శాతం వరకు సుంకాలను విధించింది. ఇంకా ఎక్కువ సుంకాలను విధిస్తామని బెదిరించింది. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిశ్శబ్దం బెదిరింపుదారులను ప్రోత్సహిస్తుంది'' అని ఆయన అన్నారు.

యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ పెంచింది.

ఇది అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపింది. వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రభావితం చేసింది.

ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనుగోలు చేయాలని బైడన్ పరిపాలనా యంత్రాంగం కోరిందని భారత్ వాదించింది.

మరోవైపు అమెరికా... యుక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు మద్దతిస్తోందని ఆరోపిస్తోంది.

ఓ వైపు అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలలో అస్థిరత కనిపిస్తుండగా, మరోవైపు భారత్, చైనా మధ్య సంబంధాలు వేగంగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అప్పటి నుంచి సంబంధాలను సాధారణస్థితికి చేర్చడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

దిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీస్ డైరెక్టర్‌ ప్రొఫెసర్ అల్కా ఆచార్య ఈ పరిణామాలను విశ్లేషించారు.

"మౌనం వహించడం, రాజీపడడం అనేవి బెదిరించేవారికి మరింత ధైర్యాన్నిస్తాయి. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవడానికి భారతదేశంతో చైనా దృఢంగా నిలబడుతుంది'' అంటూ ఇటీవల భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో జు ఫీహాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో ఒక విదేశీ దౌత్యవేత్త నుంచి మరో దేశంపై ఇలాంటి వ్యాఖ్య చేయడం అసాధారణమని విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు.

చైనాలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశం మరికొన్నిరోజుల్లో జరగనున్న సమయంలో చైనా రాయబారి నుంచి ఈ ప్రకటన వచ్చింది.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.భారత్, అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం ముఖ్యంగా క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) వంటి వాటి ద్వారా చైనా ప్రాంతీయ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది.

క్వాడ్ దేశాలు దీనిని అధికారిక సైనిక కూటమిగా కాకుండా అనధికారిక సమూహంగా భావిస్తాయి, కానీ చైనా దీనిని తనకు వ్యతిరేక కూటమిగా చూస్తుంది.

భారత్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, ఈ భాగస్వామ్యం బలహీనపడవచ్చు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతుంది.

''క్వాడ్‌కు అమెరికా ఎంత మద్దతిస్తుందో చూడాలి. జపాన్ కూడా 15 శాతం అమెరికా సుంకం పట్ల సంతోషంగా లేదు. ట్రంప్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిని కలవడం లేదు. ప్రస్తుతం, క్వాడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది'' అని చింతామణి మహాపాత్ర చెప్పారు.

బ్రిక్స్ వంటి సంస్థల ద్వారా గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించడంలో భారత్, చైనాల పాత్ర ఉంది

గ్లోబల్ సౌత్ దేశాలను ఏకం చేయడం ద్వారా పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని భారత్, చైనాలు సమతుల్యం చేస్తున్నాయి.

ఇప్పటివరకు ప్రపంచ వేదికలపై వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కొనసాగించడానికి భారత్ ప్రయత్నించింది. అమెరికా, పాశ్చాత్య దేశాలతో క్వాడ్ వంటి పొత్తులలో పాల్గొంటూనే, మరోవైపు బ్రిక్స్, ఎస్‌సీవోలలో చైనా, రష్యాతో సహకరిస్తోంది.

పూర్తిగా పాశ్చాత్య దేశాలతో లేదా చైనా నాయకత్వంలో లేనందున ఈ స్వయంప్రతిపత్తి భారత్‌ను ప్రపంచ వేదికపై మరింత ప్రభావవంతంగా చేస్తోంది.

ఇప్పుడు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యం గ్లోబల్ సౌత్‌లో భారతదేశ స్థానంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

"క్వాడ్, ఆసియా, చైనాలపై భారత్, అమెరికా ఏకగ్రీవంగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడలా కాదు. భారత్ ఇప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగుతుంది. చైనా ఎకనామిక్ సూపర్ పవర్‌గా మారినందున దానిదే పైచేయి. కానీ గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించే మార్గం చైనాకు సులభం కాదు ఎందుకంటే గ్లోబల్ సౌత్‌లోని అన్ని దేశాలు చైనా గురించి ఒకే అభిప్రాయాన్ని కలిగి లేవు'' అని ప్రొఫెసర్ అల్కా ఆచార్య విశ్లేషించారు.

భారత్-అమెరికా సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను చైనా ఎలా చూస్తుందని ఆగస్టు 14న జరిగిన విలేకరుల సమావేశంలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్‌ను అడిగారు.భారత్, చైనా మధ్య చర్చలు నిరంతరం జరుగుతున్నాయి, కానీ ఇప్పటికీ అనేక అంశాలపై ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.

రెండు దేశాలు మూడు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటున్నాయి, ఇది ఇప్పటికీ స్పష్టంగా లేదు. దీని వల్ల అప్పుడప్పుడు రెండు దేశాల సైన్యాలు ఎల్ఏసీ వద్ద ముఖాముఖీ తలపడుతున్నాయి.

సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ను భారత్ చాలా కాలంగా నిందిస్తోంది. పాకిస్తాన్‌కు చైనా సైనిక, ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే ప్రధాన కారణం.

అదే సమయంలో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) కూడా వివాదాస్పద అంశం.

అలాగే, దలైలామా, టిబెట్ శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పించింది. ఇది తన అంతర్గత రాజకీయాల్లో జోక్యంగా చైనా భావిస్తుంటుంది.

ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త దిశలో సాగుతాయా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టీ ఉంది.భారత్, అమెరికా మధ్య దూరం పెరిగితే చైనాపై దాని ప్రభావం ఎలా ఉంటుంది - ఈ ప్రశ్న చాలా మంది మనసుల్లో ఉంది.

ట్రంప్ మొదటి పదవీకాలంలో భారత్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు ఆయన రెండవ పదవీకాలంలో సుంకాల కారణంగా ప్రభావితమవుతాయని ఓ చైనా వెబ్‌సైట్ పేర్కొంది. అలాగే, ఈ మార్పుల వల్ల చైనా ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందవచ్చు.

ఫీహాంగ్ ఒక పోస్ట్‌లో అమెరికా, చైనాతో భారత వాణిజ్యాన్ని పోల్చారు.

ఈ పోస్ట్‌లో గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఒక గ్రాఫిక్ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, చైనా మధ్య వాణిజ్యం 127.71 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా, భారత్ మధ్య వాణిజ్యం 132.21 బిలియన్ డాలర్లు.

అయితే, భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతిదారు కాగా, కొన్నేళ్లగా చైనాతో భారత వాణిజ్య లోటు నిరంతరం పెరుగుతోంది.

ఈ పరిస్థితిలో, భారత్ విషయంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనా ఉండగలదా అనేది ప్రశ్న.

ఈ ప్రశ్నకు అలా ఎప్పటికీ జరగదని ? ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర సమాధానమిచ్చారు.

"చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహంలో ఎలాంటి చీలిక ఉండదు, కాబట్టి అమెరికాను చైనా ఎప్పటికీ భర్తీ చేయదు. భారత్ తాను అనుసరించిన మల్టీ ఎలైన్‌మెంట్ పాలసీ కింద చైనాతో తన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది" అని చింతామణి మహాపాత్ర వివరించారు.