జపాన్: స్మార్ట్ ఫోన్ వాడకం రోజుకు 2గంటలే..!

విద్య, పని ప్రదేశాలకు బయట మాత్రమే వర్తించే ఈ ప్రతిపాదనను కఠినంగా అమలుచేయబోమని టయోకే మేయర్ మసాఫూమి కోకి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని తగ్గించేలా ప్రోత్సహించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని వెల్లడించారు.
ఒకవేళ చట్టసభ సభ్యుల ఆమోదం పొందితే అక్టోబర్లో అమల్లోకి వచ్చే ఈ నియమాన్ని... ఎవరైనా ఉల్లంఘించినా ఎటువంటి జరిమానాలు ఉండవు.
జపాన్లోని ఓ పట్టణం స్మార్ట్ ఫోన్ వినియోగంపై పరిమితి విధించాలని భావిస్తోంది. పట్టణంలోని 69వేల మంది ప్రతిరోజు రెండుగంటలు మాత్రమే స్మార్ట్ ఫోన్ వినియోగించాలనే ప్రతిపాదన చేసింది. ఈ చర్య స్మార్ట్ ఫోన్ వ్యసనంపై తీవ్ర చర్చకు దారితీసింది.
జపాన్లో ఈతరహా ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి. ఈ వారంలో ఐచి ప్రాంతంలోని టయోకే పట్టణ అధికారులు ఈ ప్రతిపాదనను సమర్పించగా, ప్రస్తుతం చట్టసభ సభ్యుల మధ్య చర్చ జరుగుతోంది.
దీని అర్థం పౌరుల హక్కులను పరిమితం చేయడమో, బాధ్యతలను మోపడమో కాదని, బదులుగా ప్రతి కుటుంబం స్మార్ట్ ఫోన్లతో గడిపే సమయం, ఆ పరికరాలను ఉపయోగించే రోజువారీ సమయం గురించి చర్చించడానికి ఒక అవకాశం మాత్రమేనన్నారు.
వంట చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు వీడియోలు చూడటం, ఆన్లైన్లో కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇ-స్పోర్ట్స్ కోసం తర్ఫీదు పొందడం వంటివి రెండు గంటల పరిమితిలోకి తీసుకోరని వెల్లడించారు.
''రోజువారీ జీవితంలో ఉపయోగకరమైనవి, అనివార్యమైనవి'' గా స్మార్ట్ఫోన్లను తాను గుర్తించానని కోకి చెప్పారు. కానీ కొంతమంది విద్యార్థులు ఫోన్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారని, స్కూల్కు వెళ్లడం మానేస్తున్నారని అన్నారు.
పెద్దలు కూడా తమ ఫోన్లు, ట్యాబ్లను స్క్రోల్ చేస్తూ నిద్రను తగ్గించుకోవడం, కుటుంబంతో తగినంత సమయాన్ని గడపకపోవడం చేస్తున్నారని చెప్పారు.
ఈ ప్రతిపాదనపై పలువురు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారని, ఓ యూజర్ ''రెండు గంటల్లో కనీసం ఒక పుస్తకం చదవలేరు. ఒక సినిమా చూడలేరు'' అని రాశారని జపాన్ టైమ్స్ రాసింది.
జపాన్ వార్తాసంస్థ మైనిచి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రతిపాదనపై 120మంది తమ అభిప్రాయాలను ఫోన్, ఈమెయిల్ ద్వారా అధికారవర్గానికి వెల్లడించారు. వీరిలో అత్యధిక మంది (80 శాతం) ఈ ప్రతిపాదన పట్ల అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఈ బిల్లుకు మద్దతు పలికారు.