పాలన చేతగాకే రేవంత్ బూతు పురాణం

- సీఎం అసమర్థతతోనే రాష్ట్రానికి ఈ దుస్థితి
- కరువు సన్నద్ధతలో కాంగ్రెస్ ఘోరంగా విఫలం
- తప్పుల తడకగా ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ
- సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు.. ఎస్ఈసీకి బాధ్యత లేదు
- మాజీ మంత్రి తలసాని ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): పాలన చేతగాకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బూతు పురాణం వల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. కరువుతో ప్రజలు, రైతులు అరిగోస పడుతుంటే సీఎం మాత్రం పనికిరాని ముచ్చట్లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయ న తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడం తప్ప రేవంత్‌రెడ్డి ప్రజలను ఉద్ధరించిందేమీలేదని దుయ్యబట్టారు. కరువు తరుముకొస్తున్నదని ఆరు నెలలుగా బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను పెడచెవినపెట్టిన ముఖ్యమంత్రి, ఇప్పు డు క్షుద్ర పూజల పేరిట బీఆర్ఎస్పై బురదజల్లడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఎల్ నినో సన్నద్ధత చర్యలు చేపట్టడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని విమర్శించా రు. చేతగాని ముఖ్యమంత్రితోనే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ అంటే భయమెందుకు?
కరువు పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇ వ్వాల్సిన ముఖ్యమంత్రి బాధ్యాతారహితంగా వ్యవహరించారని తలసాని విమర్శించారు. బీఆర్ఎస్ పనైపోయిందని అంటున్న రేవంత్‌రెడ్డి పదేపదే బురదజల్లుతూ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కరువును ఎదుర్కొనే విషయంలో చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాన్ని కలుపుకొని వెళ్లాలని హితవుపలికారు.
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై తీవ్ర నిర్లక్ష్యం
ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియపై అటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయ ని తలసాని విమర్శించారు. హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో ఇప్పటివరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే రావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తప్పులతడకగా సాగుతున్నదని విమర్శించారు. గ్రాడ్యుయేట్లందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఓటు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిపెట్టిందని చెప్పారు. తెలంగాణభవన్‌లో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించామని, ఆది, సోమవారాల్లో జనరల్‌బాడీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం
అంతకుముందు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు నమోదుపై చర్చించా రు. మహమూద్‌అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ శ్రవణ్ పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, క్రిశాంక్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, గోసుల శ్రీనివాస్, పార్టీ నాయకురాలు మాగంటి సునీత, హేమ తదితరులు పాల్గొన్నారు.
Comments (0)