నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం

7 November 2026 - 18:00
0 0
నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం

– ఎక్స్‌రే విభాగానికి తాళంపై విస్మ‌యం
– పారిశుధ్య నిర్వహణ అధ్వానం
– చిన్నారులకు కనీస వసతుల కరువు

నీలగిరి, నవంబర్ 07 : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్ప‌త్రిలో నెలకొన్న సమస్యలు, నిర్వహణ లోపాలపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ‌నివారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రభుత్వ ఆస్ప‌త్రిని సందర్శించి వివిధ విభాగాలు, వార్డులను పరిశీలించారు. ఆస్ప‌త్రికి వచ్చే పేద, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆస్ప‌త్రిలో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ప‌త్రిలో పలు సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితమే మంజూరైన ఎంఆర్ఐ స్కాన్ సేవలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిటీ స్కాన్ సేవలు సక్రమంగా అందడం లేదని, త్రీడీ ఎక్స్‌రే విభాగానికి తాళం వేసి ఉండటాన్ని గమనించి అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్ప‌త్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఎలా అందుతాయని నిలదీశారు.

చిన్నపిల్లల విభాగంలో న్యూబార్న్ బేబీ ర్యాప్‌లు అందుబాటులో లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులను పాత బట్టల్లో చుట్టి ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ప‌త్రిలో పారిశుధ్య నిర్వహణ కూడా సరిగా లేదని, గత జనవరి నెలతోనే పాత శానిటేషన్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ఇప్పటివరకు కొత్త కాంట్రాక్టర్‌ను నియమించకపోవడం వల్ల ఆస్ప‌త్రి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయన్నారు. వెంటనే కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి పారిశుధ్య పనులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల కేసులు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిపోతున్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కంచర్ల ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య కూడా తగ్గుతోందని పేర్కొంటూ, ఈ అంశంపై అధికారులు సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.35 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణం చేపట్టామని కంచర్ల తెలిపారు. ఇందులో 50 ఐసీయూ పడకలు, 25 డయాలసిస్ పడకలు ఏర్పాటు చేసి పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనుకున్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ విభాగం నిరుపయోగంగా ఉండడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల‌న‌లో రూ.270 కోట్లతో 42 ఎకరాల విస్తీర్ణంలో నల్లగొండ మెడికల్ కళాశాలను నిర్మించామని, రూ.45 కోట్లతో నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశామని వివరించారు.

నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం

నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడికల్ కళాశాలను ప్రారంభించిన సమయంలోనే స్థానిక మంత్రికి ఆస్ప‌త్రి విస్తరణ అవసరాన్ని వివరించినట్లు తెలిపారు. అప్పటికే రూ.20 కోట్లతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, మరో రూ.250 కోట్లు కేటాయించి 1,200 పడకల ఆస్ప‌త్రిగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం పట్ల ఆయ‌న అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి ఉన్నతాధికారులు తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

ఆయ‌న వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేశ్‌, గోపగోని స్వాతి రాజశేఖర్, కనగల్ మండలాధ్య‌క్షుడు అయిత‌గోని యాదయ్య, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల యాదగిరి, భాష పాక హరికృష్ణ, దండంపెల్లి సత్తయ్య, మెరుగు గోపి, లతీఫ్, జమాల్ ఖాద్రి, పెరిక కరణ్, జయరాజ్, అశ్వాక్, అఫ్జల్, శంషుద్దీన్, సింగం లక్ష్మి, మిర్యాల యాదగిరి, వజ్జ శ్రీనివాస్, వంటల అవినాష్, అశోక్ రెడ్డి, కంకణాల వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య, అనిల్ నాయక్, నాగరాజు ఉన్నారు.

నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం

నల్లగొండ ప్రభుత్వ ఆస్ప‌త్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం

Comments (0)

User