Rajnath Singh | ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో క‌ల‌సి ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావ‌ళి వేడుక‌లు..!

7 November 2026 - 18:00
0 0
Rajnath Singh | ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో క‌ల‌సి ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావ‌ళి వేడుక‌లు..!
Rajnath Singh

Rajnath Singh : రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) భార‌త వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు (Diwali With Soldiers) జ‌రుపుకున్నారు. పశ్చిమబెంగాల్‌ (West Bengal) లోని బాగ్‌డోగ్రా ఎయిర్‌ఫీల్డ్‌లో నిర్వహించిన వేడుకల్లో సైనికులకు ఆయన మిఠాయిలు (Sweets) పంచిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత వైమానిక దళ సిబ్బంది ధైర్యం, క్రమశిక్షణ, అంకితభావాన్ని ఆయ‌న‌ ప్రశంసించారు.

మన సాయుధ దళాలు సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలాగా ఉండటం వల్లే, దేశ ప్రజలు ప్రతి పండగను ఆనందంగా, స్వేచ్ఛ‌గా జరుపుకొంటున్నారని తెలిపారు. వారు చూపే ధైర్యం, నిస్వార్థ సేవకు యావత్ దేశం ఎంతో గర్వపడుతోందన్నారు. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ తో మన వాయుసేన శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. సైనికులలో ధైర్యం, క్రమశిక్షణ లేకపోతే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా అది నిష్ప్రయోజనమేన‌ని చెప్పారు.

మన సాయుధ దళాలు క్రమశిక్షణకు మారుపేరని, క్ర‌మ‌శిక్ష‌ణ‌ ఒక సాధారణ సైనికుడిని అసాధారణ యోధుడిగా మారుస్తుందని అన్నారు. అదే సమయంలో డ్రోన్‌లు, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో సాయుధ దళాలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్‌ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి మన సైనికులు డ్రోన్‌లు ప్రయోగించడం, సైబర్‌ సెక్యూరిటీ వంటి కొత్త యుద్ధ పద్ధతులను నేర్చుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో సాంకేతికనే ఆయుధంగా చేసుకునేలా మన దళాలు మరింత మెరుగవ్వాలని, మీ అందరి సహకారంతో భారత్‌ మరింత ముందుకు వెళ్తుందని త‌న‌కు పూర్తి నమ్మకం ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలో పెరుగుతున్న‌ రక్షణ ఉత్పాదక సామర్థ్యాలను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషివల్లే దేశీయ స్టార్టప్‌లు, పరిశ్రమలు, డ్రోన్‌లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సైనికుల కోసం అధునాతన పరికరాలను అభివృద్ధి చేస్తున్నాయన్నారు.

Comments (0)

User