Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్‌లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!

26 October 2026 - 12:08
0 0
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్‌లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Vishwak

Vishwak Sen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్ట్‌’ విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈసారి సినిమా కారణంగా కాకుండా, అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్స్‌ మీట్‌ అర్ధాంతరంగా రద్దు కావడంతో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఆదివారం విశ్వక్‌ సేన్‌తో ఫొటోలు దిగేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడటంతో నిర్వాహకులు ఫ్యాన్స్‌ మీట్‌ను మధ్యలోనే నిలిపివేశారు.

విశ్వక్‌ సేన్‌ను నేరుగా కలుసుకుని ఫొటోలు దిగాలనే ఉత్సాహంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు సారథి స్టూడియోకు చేరుకున్నారు. అయితే వచ్చిన జనసందోహానికి తగిన స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో ప్రాంగణంలో రద్దీ పెరిగింది. తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తొక్కిసలాట జరిగే ప్రమాదాన్ని గుర్తించిన నిర్వాహకులు కార్యక్రమాన్ని అర్ధాంతరంగా రద్దు చేసారు. ఎంతో ఆశతో వచ్చిన అభిమానులు తమ అభిమాన హీరోతో ఫొటో దిగే అవకాశం దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో ‘కల్ట్‌’ చిత్ర బృందం నిర్వహణపై విమర్శలు మొదలయ్యాయి.

ఈ పరిణామాలపై విశ్వక్‌ సేన్‌ స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌లో అభిమానులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పారు. అభిమానుల నుంచి వచ్చిన ప్రేమాభిమానాలు తమ అంచనాలకు మించి ఉన్నాయని, అందరినీ కలవాలని తాను ఎంతో కోరుకున్నప్పటికీ తగిన ఏర్పాట్లు లేక ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. తనతో ఫొటో దిగాలనే ఆశతో వచ్చి నిరాశతో వెనుదిరిగిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు తెలిపారు. అభిమానులను పలకరించలేకపోయినందుకు బాధగా ఉందని వెల్లడించారు. త్వరలోనే మరింత మెరుగైన ఏర్పాట్లతో మరో ఫొటో సెషన్‌ నిర్వహించి, వీలైనంత ఎక్కువ మంది అభిమానులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తనపై చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

విశ్వక్‌ సేన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, కొందరు నెటిజన్లు మాత్రం చిత్ర బృందంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నాని, విజయ్‌ దేవరకొండ అభిమానులతో నిర్వహించిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి కార్యక్రమాల్లో జనసందోహాన్ని నియంత్రించేందుకు పక్కా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు.అభిమానులు ఎంతో దూరం నుంచి వచ్చి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిన తర్వాత క్షమాపణలు చెప్పడం మాత్రమే సరిపోదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు, అభిమానుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని భావిస్తున్నవారూ ఉన్నారు.

Comments (0)

User