Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్‌.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్‌ ఓకే చెప్తారా?

26 October 2026 - 12:08
0 0
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్‌.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్‌ ఓకే చెప్తారా?
Tummidi Hatti Projec

Tummidihatti Barrage | హైదరాబాద్‌, అక్టోబర్‌25 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరిస్తదా? కేసీఆర్‌ హయాంలో 148 మీటర్లతో చేసుకున్న ఒప్పందాన్ని అప్పటి, ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌ తిరగరాస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో అనేకమార్లు చర్చల అనంతరం కూడా ఎత్తు పెంపుపై అంగీకరించకపోవడమే అందుకు కారణం. మహారాష్ట్రను ఒప్పిస్తామని చెప్తూ నేడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ చర్చలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

కేసీఆర్‌ విశ్వప్రయత్నాలు చేసినా 148 మీటర్లకే

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ నిర్మించాల్సి ఉన్నది. తద్వారా 160 టీఎంసీల జలాలను మళ్లించాలనేది లక్ష్యం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోకుండానే బరాజ్‌, ఇతర హెడ్‌ రె గ్యులేటరీ నిర్మాణాలను మినహాయించి ఇతర కాలువలు, తవ్వకాల పనులను కాంగ్రెస్‌ స ర్కార్‌ చేపట్టింది. 2014లో తెలంగాణ ఏర్పాటైన 45 రోజుల్లోనే కేసీఆర్‌ ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులు చేపట్టింది.

బరాజ్‌ నిర్మాణానికి చర్చలు జరిపింది. అప్పటికీ అక్కడున్నది కాంగ్రెస్‌ సర్కారే. అప్పటి ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి హసన్‌ ముష్రఫ్‌ను కలిసి ప్రాజె క్టు అవసరాన్ని వివరించింది. అయినా అప్పటికే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్‌ రాసిన లేఖను ఆయన గుర్తుచేయడమేగాక, 152 మీటర్లకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆ తర్వాత కూడా పట్టువిడువకుండా ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ సర్కార్‌ ప్రయత్నాలను కొనసాగించింది. ఆ ఫలితంగా రెండు రాష్ర్టాల అధికారుల మధ్య రెండుసార్లు 2014 ఆగస్టు 16, 2015 ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో చర్చలు కొనసాగాయి. సాగునీటిరంగ నిపుణులు ఆర్‌ విద్యాసాగర్‌రావు సైతం చర్చల్లో పాల్గొన్నారు.

మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్‌ సర్కార్‌ పోయి బీజేపీ ప్రభు త్వం ఏర్పడింది. అప్పుడు కూడా మళ్లీ మహారాష్ట్ర సాగునీటి మంత్రి గిరీశ్‌ మహాజన్‌తో హరీశ్‌రావు ముంబైలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిషరించుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించడంతో కేసీఆర్‌ సర్కార్‌ మళ్లీ ఫిబ్రవరి 17న సీఎం ఫడ్నవీస్‌తో సంప్రదింపులు చేపట్టి కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. 152 మీటర్లతో అంగీకరించబోనని ఫడ్నవీస్‌ తేల్చిచెప్పారు. అయితే 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించుకుంటే సహకరిస్తామని మాత్రం హామీ ఇచ్చారు.

2016లో రెండు రాష్ర్టాల మధ్య ఆ ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఒప్పందం జరిగింది. ఆ ప్రకా రం బరాజ్‌ నిర్మిస్తే నిర్దేశిత లక్ష్యం మేరకు గో దావరి జలాలను మళ్లించుకోలేని పరిస్థితి. బరాజ్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 152గా, హెడ్‌ రెగ్యులేటర్‌ సిల్‌ లెవల్‌ 145.25 మీటర్లుగా ఖరారు చేసి అప్పటికే కాలువలు తవ్వారు. ఇక బరాజ్‌ ఎత్తు 148 మీటర్లకు కుదించడం వల్ల 2.55 మీటర్ల మేరకే వాటర్‌ హెడ్‌ తగ్గిపోయింది. 150 రోజుల పాటు నీటిని మళ్లించుకున్నా 44 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితి.

పీసీఎస్‌ఎస్‌ ప్రాజెక్టు ఆయకట్టుకే ఇంకా 100 టీఎంసీల లోటు ఏర్పడుతుంది. అదేసమయంలో సీడబ్ల్యూసీ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. 165 టీఎంసీల జలాలున్నా అందు లో ఎగువ రాష్ర్టాలు వినియోగించుకోని 63 టీఎంసీలు ఉన్నాయని వెల్లడించింది. భవిష్యత్తులో ఎగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు కట్టి జలాలను వినియోగించుకుంటే నికరంగా అందు లో ఉండేది 102 టీఎంసీలేనని తేల్చిచెప్పింది. అలా మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సూచనల నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌ తుదకు సమస్యలన్నింటికీ పరిష్కారంగా, ప్రాజెక్టును రీడిజైన్‌ చేసింది. ప్రాణహిత-చేవెళ్లను రెండు గా విభజించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ కోసం ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులు చేపట్టింది.

ఇప్పుడు గత ఒప్పందాన్ని తిరగరాస్తారా?

గత 148 మీటర్ల ఒప్పందాన్ని ఆ రాష్ట్రం ఇ ప్పుడు తిరగరాసుకునేందుకు అంగీకరిస్తుం దా? అనేది చర్చనీయాంశమైంది. 2007 నుంచి 2014 వరకు కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో ఉన్నది కాంగ్రెస్సే. ఆ సమయంలోనే తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతీ సాధించలేదు. ఇక 152 మీటర్లతో బరాజ్‌ నిర్మిస్తే ముంపు వాటిల్లుతుందని వ్యతిరేకించింది ప్రస్తుత సీఎం ఫడ్నవీసే. గత చర్యలకు భిన్నంగా, మళ్లీ 152 మీటర్లకు ఎలా అంగీకరిస్తారో చూడాలి.

నేడు మహారాష్ట్రకు రేవంత్‌

తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లతో బరా జ్‌ నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్‌, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి జలాలను తరలిస్తామని ఎన్నికలప్పుడు ప్రగల్భాలు పలికింది. మూ డేండ్లు గడిచినా తట్టెడు మట్టి తీయలేదు. సాంకేతిక అంశాలపై అధ్యయనం చేసి డీపీఆర్‌ తయారీ బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించి చేతులు దులుపుకొన్నది. ఎల్లంపల్లి కాకుండా తమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు జలాలను తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక బరాజ్‌ ఎత్తు 152 మీటర్లు, లేదంటే 150, లేదంటే 149 మీటర్లకు ఒ ప్పిస్తామంటూ కాలం గడిపింది. మహారాష్ట్రతో ఎలాంటి చర్చలు జరుపకుండానే ప్ర ణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో మహారాష్ట్ర అధికారులతో ఢిల్లీలో తొలిసారి చర్చలు నిర్వహించి ముంపు, పునరావాసానికి ఎంతైనా భరిస్తామని, 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ నిర్మాణానికి అంగీకరించాలని ప్రతిపాదిం చింది. అయితే నీటి లభ్యతపై కొత్త అధ్యయనాలు ఇవ్వాలని స్పష్టంచేసిన క్రమం లో సీఎం రేవంత్‌, మహారాష్ట్రలో నేడు సీఎం ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు.

Comments (0)

User