BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు

ఊట్కూర్ : ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ నిరసన తెలిపిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్‌రెడ్డి, సీనియర్ నాయకుడు తరుణ్ పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు వంద రోజుల్లోనే 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా నెరవేర్చలేదని ఆరోపించారు. గత సెప్టెంబర్ 7న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన చేపట్టగా మక్తల్ సీఐ రామ్‌లాల్ 11 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు హాజరై స్టేషన్ బెయిల్ పొందారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి పథకాలతో వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు.
కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేకే మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతనపల్లి అభిలాష్ రెడ్డి, ఉబేదుర్ రహిమాన్, షేక్ షమీ, రామలింగం గౌడ్, హనుమంతు, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments (0)