CBI Raids | రైస్‌ మిల్లర్లపై సీఐడీ దాడులు… నిజామాబాద్‌, కరీంనగర్‌, ములుగులో అక్రమాలు

26 October 2026 - 12:08
0 0
CBI Raids | రైస్‌ మిల్లర్లపై సీఐడీ దాడులు… నిజామాబాద్‌, కరీంనగర్‌, ములుగులో అక్రమాలు
Wa

CBI Raids |హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సన్న ధాన్యం కేటాయింపుల నుంచి బియ్యం సరఫరా వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ సీఐడీ మూడు కేసులు నమోదు చేసింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్ని రైస్‌మిల్లులు నాసిరకం, దొడ్డు బియ్యం సరఫరా చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఐడీ పేరొన్నది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మూడు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, 14 మంది మిల్లర్లను అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ చారుసిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

2025-26 వానకాలంలో తెలంగాణ ప్రభుత్వం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఎఫ్‌సీఐకి 59.60 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. సన్నధాన్యం కేటాయింపులు పొందిన కొందరు మిల్లర్లు.. ఆ ధాన్యాన్ని బహిరంగ మారెట్‌కు తరలించి, దాని స్థానంలో తకువ ధరకు లభించే దొడ్డుబియ్యాన్ని పాలిష్‌ చేసి సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో రాష్ట్రం వెలుపలి నుంచి సేకరించిన బియ్యం కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో సివిల్‌ సైప్లె కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌) ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధానంగా ఆరోపణలు వచ్చిన నిజామాబాద్‌, కరీంనగర్‌, ములుగు జిల్లాల్లోని 16 రైస్‌ మిల్లులు సన్న రకం బియ్యం కేటాయింపులకు బదులుగా 3,385.820 టన్నుల దొడ్డుబియ్యాన్ని సరఫరా చేసినట్టు సీఐడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సరఫరాల కారణంగా సన్నబియ్యానికి వర్తించే బో నస్‌ పరంగా ప్రభుత్వానికి సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

మరో రూ.242 కోట్ల నష్టం తప్పిందా?

ఇదే వ్యవహారంలో మరో 45,414.833 టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కేటాయింపులు జరిగినట్టు సీఐడీ పేరొన్నది. ఈ పరిమాణంలోనూ సన్నబియ్యం స్థానంలో దొడ్డుబియ్యాన్ని సరఫరా చేస్తే బోనస్‌ రూపంలో ప్రభుత్వంపై సుమారు రూ.242 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. అయితే, పౌరసరఫరాల శాఖ అధికారులు సకాలంలో జోక్యం చేసుకొని సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మరింత నష్టం జరుగకుండా అడ్డుకున్నట్టు సీఐడీ తెలిపింది.

ఈ రెండు అంశాలకు సంబంధించి పేరొన్న అంచనాలను కలిపితే సుమారు రూ.243.69 కోట్ల మేర ఆర్థిక ప్రభావం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అయితే, ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, వాస్తవ నష్టాన్ని దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉన్నదని సీఐడీ అధికారులు తెలిపారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్‌ఫోర్స్‌ (ఈటీఎఫ్‌) బృందాలు నిర్వహించిన తనిఖీల అనంతరం సేకరించిన బియ్యం నమూనాలను ప్రయోగశాలల్లో పరీక్షించినట్టు సీఐడీ వెల్లడించింది. పరిశీలించిన కేసుల్లో సరఫరా చేసిన బియ్యం.. కేటాయింపుల్లో నిర్దేశించిన సన్న రకం ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షల్లో తేలిందని పేరొన్నది.

అధికారుల పాత్రపై ఆరా

ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని దారి మళ్లించడం, బియ్యం రకాన్ని మార్చి సరఫరా చేయడం ద్వారా అక్రమ లాభం పొందడం, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నదని సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. వానకాలం మారెటింగ్‌ సీజన్‌ 2025-26కు సంబంధించిన సీఎంఆర్‌ ఒప్పంద నిబంధనల ఉల్లంఘనతోపాటు ప్రభుత్వానికి నష్టం కలిగించే కుట్ర వంటి అంశాలు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చాయని సీఐడీ తెలిపింది.

మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు ఎలా జరిగాయి? బియ్యంగా మార్చేందుకు అనుమతులు ఎలా మంజూరయ్యాయి? సన్నధాన్యాన్ని బహిరంగ మారెట్‌కు తరలించారా? బియ్యం రకం మార్పులో ఎవరెవరి పాత్ర ఉన్నది? ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు తెలిపింది. సాక్ష్యాలను సేకరించి వాస్తవ నష్టాన్ని నిర్ధారిస్తామని సీఐడీ స్పష్టం చేసింది.

హుజూరాబాద్‌లో నలుగురు మిల్లర్ల అరెస్టు

జమ్మికుంట, అక్టోబర్‌ 25: ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించడం, సన్న బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం, ఎఫ్‌సీఐకి లెవీగా గ్రేడ్‌ ‘ఏ’ రకం బియ్యానికి బదులు కామన్‌ వెరైటీని పెట్టడం.. తదితర ఆరోపణల నేపథ్యంలో ఆదివారం హుజూరాబాద్‌ డివిజన్‌లోని నలుగురు రా రైస్‌ మిల్లర్లని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్‌లో కల్లూరి కృష్ణమూర్తి (వరలక్ష్మి), జమ్మికుంటలో వొల్లాల మల్లికార్జున్‌ (అన్నపూర్ణ), యాంసాని సంపత్‌కుమార్‌ (లక్ష్మీసాయి), లెంకలపెల్లి మధుసూదన్‌ (కారుణ్య) రైస్‌మిల్లర్లు ఉన్నారు. వీరిని కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్టు తెలిసింది.

దీంతో మిల్లర్ల అసోసియేషన్‌ బాధ్యులు, సభ్యులు సంఘ కార్యాలయానికి చేరుకొని వారిని కేసుల నుంచి తప్పించేందుకు అమాత్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు ఫోన్లు చేస్తూ కాపాడాలని విజ్ఞప్తులు చేస్తున్నట్టు సమాచారం. మిల్లర్ల అక్రమాలపై సివిల్‌ సైప్లె కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 14న విజిలెన్స్‌ (టాస్క్‌ఫోర్స్‌) విభాగానికి చెందిన అధికారుల బృందం హుజూరాబాద్‌, జమ్మికుంటకు వచ్చి పలు మిల్లుల్లో తనిఖీలు చేపట్టింది. ఇదే సమయంలో అధికారులు, మిల్లర్లు మిలాఖత్‌ అయ్యారని.. అధికారులకు ఓ మిల్లర్‌ లాడ్జిలో బస, విందు ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ విషయమై ‘తనిఖీలకొచ్చి తాగి తందనాలాడి..’ కథనం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కాగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీందో ఉన్నతాధికారులు వెంటనే సీఐడీని రంగంలో దింపినట్టు సమాచారం.

రైస్‌ మిల్లర్ల ఎన్నికల వేళ అరెస్టులు!

ములుగు జిల్లాలో జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పలువురు రైస్‌ మిల్లర్లను సీఐడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనాత్మకంగా మారింది. అధ్యక్ష పదవికి బరిలో ఉన్న బాదం ప్రవీణ్‌తోపాటు మరో ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎన్నికలు జరుగాల్సి ఉండగా, ఉదయం 7 గంటలకే ఆయా రైస్‌మిల్లర్ల ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి బాదం ప్రవీణ్‌తోపాటు మరో ముగ్గురిని ములుగు డీఎస్పీ కార్యాలయానికి తరలించి అక్కడి నుంచి పోలీస్‌ బందోబస్తు నడుమ రైస్‌మిల్లర్స్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు.

చివరికి బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ వేయకపోవడంతో ఒకే నామినేషన్‌ వేసిన కాట్రగడ్డ సతీశ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాట్రగడ్డ సతీశ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలుడనే పేరున్నది. అనంతరం ప్రవీణ్‌తోపాటు ముగ్గురు రైస్‌ మిల్లర్లను సీఐడీ అధికారులు హనుమకొండకు తరలించి విచారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విజలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టయిన రైస్‌ మిల్లర్ల మిల్లులను తనిఖీ చేసి లోపాలను గుర్తించారని తెలిసింది. జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మిల్లర్ల అరెస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

Comments (0)

User