Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!

Brazil President : లాటిన్ అమెరికా (Latin America) ఖండంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్ (Brazil) రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల పోరులో దిగ్గజ నాయకుడు, బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డ సిల్వా (Luiz Inacio Lula da Silva) ఘన విజయం సాధించారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో వామపక్ష నాయకుడైన లూలా.. తన ప్రత్యర్థి, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు (Brazil Ex President) జైర్ బోల్సోనారో (Jair Bolsonaro) కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో (Flavio Bolsonaro) ను ఓడించారు. తద్వారా బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
సుపీరియర్ ఎలక్టోరల్ కోర్ట్ విడుదల చేసిన అధికారిక ఫలితాల ప్రకారం.. లూలా డ సిల్వాకు 51.8 శాతం ఓట్లు రాగా.. బోల్సోనారోకు 48.2 శాతం ఓట్లు దక్కాయి. దాదాపు 40 లక్షల ఓట్ల తేడాతో లూలా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాగా బ్రెజిల్‌లో 1980లలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ తర్వాత.. ఓ ఎన్నికల్లో మొదటి విడత ఓటింగ్‌లో రెండో స్థానంలో నిలిచిన నాయకుడు రన్‌ఆఫ్ పోరులో గెలిచి దేశాధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ 4న జరిగిన మొదటి విడత పోలింగ్‌లో ప్లావియో బోల్సోనారో 47 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. లూలా 45 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.
అయితే ఆ తర్వాత లూలా తన ప్రచార వ్యూహాన్ని మార్చారు. ‘మళ్లీ బోల్సోనారో వద్దు’ అనే నినాదంతో భారీ ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం, సంక్షేమ పథకాలు, ప్రజా రవాణాపై ఇచ్చిన హామీలు ఆయనను విజయం వైపు నడిపించాయి. ఫలితాలు వెలువడగానే సావోపాలో సహా బ్రెజిల్‌లోని అనేక ప్రధాన నగరాల్లో లూలా మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మాజీ కార్మిక నాయకుడైన లూలా.. 2003 నుంచి 2010 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని అవినీతి కేసుల కారణంగా జైలుపాలైనప్పటికీ, కోర్టు ఆ కేసులను కొట్టివేసిన అనంతరం 2023లో మళ్లీ అధికారంలోకి వచ్చారు.
ఆయన పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తగ్గడమే కాకుండా సంక్షేమ పథకాలు విస్తరించడంతో ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. అయితే తాజా ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే లూలా నాలుగో విడత పాలన అంత సులువుగా ఉండేలా కనిపించడం లేదు. బ్రెజిల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కన్జర్వేటివ్ (రైట్-వింగ్) పార్లమెంట్ ఎన్నికైంది. బోల్సోనారో నేతృత్వంలోని లిబరల్ పార్టీ, దాని మిత్రపక్షాలకు ఉభయసభల్లో భారీ మెజారిటీ లేదా సమాన బలం ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు దేశంలో ఆర్థిక లోటు, పెరిగిన జీవన వ్యయం, పెరిగిపోతున్న ప్రజా రుణాలు, తీవ్రమైన రాజకీయ వర్గపోరు లూలా ముందున్న ప్రధాన సవాళ్లు.
అయినప్పటికీ ఈ విజయం లాటిన్ అమెరికాలో బలపడుతున్న రైట్-వింగ్ ప్రభావాన్ని నిరోధించడంలో కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments (0)