
మియన్మార్ భూకంపానికి కారణమేమిటి? బ్యాంకాక్‌లో ఆ ఒక్క భవనమే ఎందుకు కూలింది?
భూకంపం సమయంలో బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు ఊగుతున్న దృశ్యాలు, బిల్డింగ్‍పైన ఉన్న ఈతకొలనుల నుంచి నీరు ఎగసిపడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బ్యాంకాక్‌లోని చతుహక్ జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయమే భూకంప సమయంలో కూలిపోయిన ఏకైక బిల్డింగ్
మియన్మార్‌లో భారీ భూకంపం ధాటికి 1,600 మందికి పైగా మృతి చెందగా, అనేక భవనాలు కూలిపోయాయి.
మియన్మార్ భూకంపాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశమే కానీ దాని పొరుగున ఉన్న థాయిలాండ్, చైనాలకు మాత్రం అలాంటి ప్రమాదం లేదు. అయినా, ఈ భూకంప ప్రభావం ఆ దేశాలపైనా పడింది.
శుక్రవారం నాటి భూకంప కేంద్రం నుంచి థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 1,000 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అయినప్పటికీ బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం ఒకటి కూలిపోయింది.
భూమి పైపొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే వివిధ విభాగాలతో ఉంటుంది. అవన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి. కొన్ని ఒకదానిపక్కన ఒకటి కదులుతుంటే మరికొన్ని పైన, కింద కదులుతుంటాయి.
ఈ కదలికలే భూకంపాలకు, అగ్నిపర్వతాలు బద్దలవడానికి కారణమవుతాయి.
భూకంపాలు భూమికి 700 కి.మీ లోపల వరకూ సంభవిస్తాయి. అయితే మియన్మార్‌లో భూకంపం భుఉపరితలం నుండి కేవలం 10 కి.మీ. లోపలే సంభవించింది. కాబట్టి ఇది భూఉపరితలంపై కంపనాలను పెంచుతుంది.
ఇది చాలా పెద్ద భూకంపం. తీవ్రత 7.7 గా నమోదైంది. ఇది హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసింది అని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
“గత శతాబ్దకాలంలో ఈ ప్రాంతంలో 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు భూకంపాలు వచ్చాయి”
ఫాల్ట్ లైన్ ఎంతవరకు ఉందో అందులో చాలా దూరం వరకు భూకంప ప్రభావం ఉండొచ్చు.. మియన్మార్ భూకంప ప్రభావం కూడా థాయిలాండ్ వైపు 1200 కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది.
భూకంప ప్రభావం భూమి ఉపరితలంపై ఎలా ఉంటుందనేది అక్కడి నేల స్వభావం బట్టి కూడా ఉంటుంది.
బ్యాంకాక్ నిర్మితమైన మృదువైన నేలలో భూకంప తరంగాల వేగం నెమ్మదిస్తుంది కానీ తరంగాలు పెద్దవవుతాయి.మియన్మార్‌ను ప్రపంచంలోనే భౌగోళికంగా అత్యంత యాక్టివ్‌గా ఉండే ప్రాంతంగా పరిగణిస్తారు. దానికి కారణం.. ఈ ప్రాంతం నాలుగు టెక్టోనిక్ ప్లేట్లు( యూరేసియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, సుండా ప్లేట్, బర్మా మైక్రోప్లేట్ ) కలిసే చోట ఉంటుంది.
ఇండియన్ ప్లేట్... యూరేసియన్ ప్లేట్‌ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇండియన్ ప్లేట్ బర్మా మైక్రోప్లేట్ కిందకు చొచ్చుకు పోవడం వల్ల 2004లో సునామీ వచ్చింది.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ టెక్టోనిక్స్ రీడర్ అయిన డాక్టర్ రెబెక్కా బెల్ మాట్లాడుతూ.. 'ఈ కదలికలన్నింటినీ సర్దుబాటు చేయడానికి శిలలో పగుళ్లు ఏర్పడతాయి, దీని వల్ల టెక్టోనిక్ ప్లేట్లు పక్కకు జారుతాయి' అని చెప్పారు.
సాగింగ్ ఫాల్ట్ అని పిలిచే ఒక పెద్ద ఫాల్ట్ ఉంది, ఇది మయన్మార్ భూగర్భంలో ఉత్తరం నుంచి దక్షిణానికి 1,200 కి.మీ. కంటే ఎక్కువ పొడవున ఉంటుంది.
శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి కారణమైన కదలిక "స్ట్రైక్-స్లిప్" అని నిపుణులు చెప్తున్నారు. అంటే రెండు ఎర్త్ బ్లాక్‌లు ఎదురెదురుగా అడ్డంగా కదలడం.
ఎర్త్ బ్లాకులు పక్కపక్కన కదులుతున్నప్పుడు అవి రాసుకుపోయి ఘర్షణను పెంచుతాయి, అవి రెండూ అకస్మాత్తుగా వేరైనప్పుడు ప్రకంపనలు వస్తాయి.