ఒక్క భూమిపైనే కాకుండా మన సౌరకుటుంబంలో భాగమైన ఇతర గ్రహాలపై మనిషి నివశించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా పరిశోధనలు జరుపుతున్నారు. వాటిలో భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, అంగారక గ్రహాల ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ.. అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు.. దాని నీటి జాడలు, అది ఎండిపోయిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఇసుక బీచ్‌ల ఆనవాళ్లు ఉన్నట్లు తాజా అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ విప్లవాత్మక అన్వేషణ అంగారక గ్రహం గతం గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది.
అలాగే ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందనే విషయంతో పాటు, భవిష్యత్తులో మనిషి ఇక్కడ జీవించవచ్చు అనే ఆశను కూడా ఇస్తోంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైన నీటిని కలిగి ఉండేదని ఈ పరిశోధన ఇప్పటివరకు అత్యంత దృఢమైన ఆధారాలను అందిస్తుంది.
అధునాతన గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్‌తో అమర్చబడిన చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉండి, అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి.