పురులియా: 30 ఏళ్లకిందట ఆకాశం నుంచి వందల ఏకే 47లు, గ్రెనేడ్లు ఇక్కడ ఎందుకు జారిపడ్డాయి, ఏం జరిగింది?
పురులియాలో రష్యన్ ఆంటోనోవ్ AN 26 విమానం ఆయుధాలను జారవిడిచింది.
అది 1995 డిసెంబర్ 17 రాత్రి. నాలుగు టన్నుల బరువున్న ప్రమాదకరమైన ఆయుధాలున్న రష్యన్ ఆంటోనోవ్ ఏఎన్-26 విమానం కరాచీ నుంచి ఢాకాకు బయలుదేరింది.
ఆ విమానంలో ఎనిమిది మంది ఉన్నారు. కిమ్ పీటర్ డేవి అనే డెన్మార్క్ దేశీయుడు, పీటర్ బ్లీచ్ అనే బ్రిటిష్ ఆయుధ వ్యాపారి, సింగపూర్‌లో ఉంటున్న భారత సంతతి వ్యక్తి దీపక్ మణికాన్, మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఐదుగురు రష్యన్ మాట్లాడేవారు, లాత్వియా పౌరులు.
సీబీఐకి పీటర్ బ్లీచ్ ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలను అంగీకరించారు. కరాచీకి వచ్చే ముందు ఆ ఆయుధాలను బల్గేరియాలోని బుర్గాస్‌లో విమానంలో లోడ్ చేసినట్లు చెప్పారు.
ఈ విమానం వారణాసిలోని బాబత్‌పూర్ విమానాశ్రయంలో ఇంధనం నింపుకుంది. అక్కడ, విమానంలోని ఆయుధాల చెక్క పెట్టెలకు మూడు పారాచూట్లు కట్టారు.
చందన్ నంది, బ్రిటిష్ జర్నలిస్ట్ పీటర్ పోప్హామ్ ప్రకారం, విమానంలో ఉన్న ఆయుధ డీలర్ పీటర్ బ్లీచ్‌కు బ్రిటిష్ నిఘా సంస్థ ఎంఐ6తో సంబంధాలున్నాయి. కొన్నిసార్లు వారి గూఢచర్య కార్యకలాపాలలో పీటర్ సహాయం చేశారు.
విమానం వారణాసి నుంచి బయలుదేరినప్పుడు, తన విమానాన్ని కూల్చేస్తారని బ్లీచ్ భయపడ్డారు.
"విమానయానానికి మూడు నెలల ముందు, ఒక డానిష్ కస్టమర్‌కు పెద్ద మొత్తంలో ఆయుధాలు కావాలని తనను సంప్రదించారని పీటర్ బ్లీచ్ నాతో చెప్పారు. ఈ ఆయుధాలు ఏ దేశానికీ కాదు, తీవ్రవాద సంస్థకు అని తెలుసుకున్నప్పుడు, దాని గురించి బ్రిటిష్ నిఘా విభాగానికి సమాచారం ఇచ్చారు బ్లీచ్.
బ్రిటన్ వార్తాపత్రిక 'ది ఇండిపెండెంట్' 2011 మార్చి 6వ తేదీ సంచికలో ప్రచురితమైన 'అప్ ఇన్ ఆర్మ్స్: ది బిజార్ కేస్ ఆఫ్ ది బ్రిటిష్ గన్ రన్నర్, ది ఇండియన్ రెబెల్స్ అండ్ ది మిస్సింగ్ డెన్' అనే వ్యాసంలో పీటర్ పోప్హామ్ ఇలా రాశారు.
పురులియాలో ఆయుధాలు జారవిడిచి...
ఈ మిషన్ సమయంలో, భారత ప్రభుత్వం దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎటువంటి సూచనలు లేవు.
పీటర్ పోప్హామ్ దీని గురించి వ్యాసంలో "వారణాసి నుంచి బయలుదేరినప్పుడు బ్లీచ్ ఆందోళనకు గురయ్యారు. విమానాన్ని కూల్చివేయాలని భారత్ నిర్ణయించుకుందని ఆయన భావించారు. తన జీవితానికి ముగింపు దగ్గర పడిందని భయపడ్డారు" అని రాశారు.
కాగా, విమానం ఆ రాత్రే చీకటిలో ఆయుధాలను జారవిడిచింది. కానీ, ఏమీ జరగలేదు. ఇబ్బందులు తొలగాయనుకున్నారు బ్లీచ్. కానీ అక్కడి నుంచే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వందలాది AK-47 రైఫిళ్లు, ఆయుధాలు నేలపై చెల్లాచెదురుగా జనాలకు కనిపించాయి.