రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ

కారేపల్లి, అక్టోబర్ 19 : కారేపల్లి మండలం గాదేపాడు, కోమట్లగూడెం గ్రామాలకు చెందిన మద్దెబోయిన వెంకటేష్, మద్దెబోయిన రమ్య దంపతులు రఘునాథపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఎమ్మెల్యే డా.బి.చంద్రావతి అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వారి పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించారు. దంపతుల అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం హృదయ విదారకమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు.
Comments (0)