ఫోక్స్‌వ్యాగన్‌ పెట్టుబడులు వెనక్కి!

25 October 2026 - 08:44
0 0
ఫోక్స్‌వ్యాగన్‌ పెట్టుబడులు వెనక్కి!
13

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24: భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్‌ ప్రస్తుతం వెనక్కి తగ్గింది. దేశంలో ఈవీ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంస్థ..ప్రస్తుతం ఈ పెట్టుబడులపై వెనక్కి తగ్గింది. ఈవీ తయారీ ప్లాంట్‌ గురించి జేఎస్‌డబ్ల్యూతో భాగస్వామ్య చర్చలు జరుపుతున్న ప్రస్తుత తరుణంలో వీటిని నిలివేసినట్టు తెలుస్తున్నది.

జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్‌ జిందాల్‌తో జరుపుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించారు. దేశీయ భాగస్వామితో చర్చలు ముగిసినప్పుడు, తొలుత చైనా కోసం అభివృద్ధి చేసిన తక్కువ ధర ఈవీ ప్రాజెక్టును వేగంగా విస్తరించింది. ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకుపోవడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న జర్మనీకి చెందిన సంస్థ..మరింత స్పష్టమైన వ్యాపార ప్రణాళిక కోసం ఎదురుచూస్తున్నదని వివరించింది.

ఈ పెట్టుబడులపై ఫోక్స్‌వ్యాగన్‌ ప్రతినిధులు కానీ, జేఎస్‌డబ్ల్యూ వర్గాలు కానీ వెల్లడించడానికి నిరాకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్ల తయారీ సంస్థ..యూరప్‌లో బలహీనమైన డిమాండ్‌, చైనా ఆటోమొబైల్‌ తయారీ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. దీంతో సంస్థ పెట్టుబడి సుమారు 15 శాతం మేర తగ్గించుకోవాలని చూస్తున్నది. దీంతోపాటు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పదివేల మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నది.

Comments (0)

User