పాలమూరు రైతులకు ఉరితాడుగా డిండి ప్రాజెక్టు

- సొంత జిల్లా రైతుల గొంతు కోసేలా సీఎం రేవంత్ వ్యవహారం
- తక్షణమే రద్దు చేయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): డిండి ఎత్తిపోతల పథకం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన మొదటి రోజు నుంచే పాలమూరు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల వ్యతిరేకతతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ దీన్ని తెరపైకి తెచ్చి ముందుకు తీసుకెళ్లాలని చూడటం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. డిండి ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లిస్తే స్థానిక ఆయకట్టు ఎండిపోయి, పాలమూరు అన్నదాతల హకులకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్థానిక రైతుల ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, వారి గొంతు కోసేలా వ్యవహరించడం సమంజసం కాదని డీకే అరుణ హితవు పలికారు.
పాలమూరు ప్రాంత వ్యవసాయాన్ని, తాగునీటి అవసరాలను గాలికొదిలేసి ప్రాజెక్టును ముందుకు నడిపిస్తే రైతుల పక్షాన తీవ్ర పోరాటం తప్పదని హెచ్చరించారు. పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ తరఫు న అధికారికంగా లేఖ రాస్తామని స్ప ష్టంచేశారు. పాలమూరు రైతుల నీటి వాటాలను పరిరక్షించే వరకు విశ్రమించేది లేదని, పునరాలోచన చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments (0)