Uttam Kumar Reddy | కాళేశ్వరం నీళ్లు ఎత్తనే ఎత్తం.. మరోసారి మంత్రి ఉత్తమ్ వితండవాదన!

Uttam Kumar Reddy | హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా, సాగునీళ్లు కరువై పంటలు ఎండిపోతున్నా, భవిష్యత్తులో తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు కండ్ల ముందే కనిపిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు కరువై రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినా కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసేందుకు సర్కార్ ఇప్పటికీ ససేమిరా అంటున్నది.
ఇందులో భాగంగానే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టారు. మరమ్మతులు చేసిన తర్వాతే ఎత్తిపోస్తామని, అప్పటి వరకు ఆ ఆలోచనే లేదని వితండ వాదనకు దిగారు. పైగా ఆ పాపాన్ని ఎన్డీఎస్‌ఏపై, బీఆర్‌ఎస్‌పై నెట్టేందుకు ప్రయత్నించారు. గేట్లు ఎత్తిపెట్టాలని, ఇక్కడ నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్‌ఏ సూచించినట్టు చెప్పారు. అదే సందర్భంగా ఎన్డీఎస్‌ఏ చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలను తొక్కిపెట్టడం గమనార్హం. ఈ మేరకు శనివారం సచివాలయంలో కాళేశ్వరంపై మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పాపం.. బీఆర్‌ఎస్‌పై నిందలు
కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చే సిన ఆరోపణలే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నది. ఇప్పటివరకు కాళేశ్వరం మరమ్మతులపై దృష్టి పెట్టనే లేదు. ఇప్పుడు ఎల్ నినో రూపంలో ముంచుకొచ్చిన కరువు.. కాళేశ్వరం ప్రాజెక్టు విలువను తెలియజేస్తున్నది. ఇన్నాళ్లూ నీళ్లు ఎత్తిపోయకుండా తాత్సరం చేసిన సర్కార్ రాష్ట్రంలో కరువుకు కారణమైందనే విమర్శలున్నాయి. దీంతో సర్కార్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో రైతులు, ప్రజలు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌పై ఆ నెపం నెట్టేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నానా తంటాలు పడ్డారు. దాదాపు మూడేండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా మరోసారి దీనికి కారణం బీఆర్‌ఎస్ అంటూ బద్నాం చేసే ప్రయత్నం చేశారు. మళ్లీ తమ్మిడిహట్టి, ఇతర ప్రాజెక్టులంటూ పాత రాగం ఎత్తుకున్నారు.
కూళేశ్వరం అన్నారు… ఇప్పుడు రిపేర్లు చేస్తున్నారు
దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలియదన్నట్టుగా కరువు వస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం విలువ తెలియలేదు. ఇన్నాళ్లూ దీన్ని కూళేశ్వరం అని, ఇది ఎందుకూ పనికిరాదని, లక్ష కోట్లు గోదాట్లో పోశారంటూ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు దీన్ని రిపేర్ చేయడం కూడా కుదరదని చెప్పారు. కానీ అప్పుడు వద్దన్న కాళేశ్వరమే ఇప్పడు దిక్కుగా మారింది. అప్పుడు కూళేశ్వరమన్నా కాళేశ్వరమే ఇప్పుడు ఎడారిలో ఒయాసిస్సులా మారింది.
కరువు పరిస్థితులు నెలకొనడం, ఎక్కడా నీళ్లు లేకపోవడంతో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను రిపేర్ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే సంబంధిత డిజైన్లు రూపొందించినట్టు తెలిపారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన టెక్నికల్ ఓవర్‌నైట్ కమిటీతో చర్చించినట్టు చెప్పారు. పనులు చేపట్టే ఏజెన్సీల సన్నద్ధత, సమీకరణను నవంబర్ నెలాఖరు వరకు పూర్తి చేసి, డిసెంబర్ నెలాఖరులోగా పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
2027 వర్షాకాలానికి ముందే పునరుద్ధరణ పనులు పూర్తిచేసేలా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పుడు కూలిపోయిందని, రిపేర్‌కు కూడా పనికిరాదన్న ప్రాజెక్టును ఇప్పుడెలా రిపేర్ చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నా యి. అయితే ఇన్నాళ్లూ కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసినవన్నీ ఆరోపణలేనని, బీఆర్‌ఎస్‌పై నిందలు వేయడానికే ఇవన్నీ చేసిందని తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పాపం పటాపంచలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాలున్నా నిర్లక్ష్యం
ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మం త్రి ఉత్తమ్ నానా తంటాలు పడ్డారు. మేడిగడ్డ నుం చి ఇప్పటికీ నీళ్లు దిగువకు పోతున్నాయి. అయినా ప్రభుత్వం వాటిని ఎత్తిపోసే ఆలోచన చేయడమే లేదు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగాయనే సాకు చూపుతూ నీళ్లను వృథాగా వదిలేస్తున్నది. మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండానే నీళ్లను ఎత్తిపోసే అవకాశాలున్నాయని నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. కాఫర్‌డ్యామ్ గానీ, రబ్బర్ డ్యామ్ గానీ నిర్మించి నీళ్లను ఎత్తిపోయొచ్చని సూచించారు.
అయినా ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచన కూడా చేయలేదు. ఒకవేళ కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తే ప్రజల్లో, రైతుల్లో బీఆర్‌ఎస్‌కు పేరొస్తుందనే కడుపుమంటతో కాళేశ్వరాన్ని ఎండబెతున్నది. అయితే బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష.. రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి సుమారు 758 టీఎంసీల నీళ్లు వృథాగా కిందికి పో యాయి. ఆ నీళ్లను ఏపీకి జలకళను తీసుకొచ్చాయి. ఏపీలోని ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నా యి. దీంతో ఏపీలో సాగు నీళ్లకు హారతి పడుతుం టే.. తెలంగాణలో మాత్రం రైతులు నీళ్లు లేక ఎండి న పంటలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Comments (0)