Cheyutha Pension | దసరా దాటిపాయె.. కొత్త పింఛన్లు రాకపాయె.. 4.60 లక్షల మంది అర్హులకు తప్పని ఎదురుచూపులు

Cheyutha Pension | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ వస్తే కొత్త పింఛన్లు అందుతాయని ఆశించిన లక్షలాది మంది నిరుపేదలకు నిరాశే మిగిలింది. పండుగ దాటిపోయినా కొత్త పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. దసరా నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఆశలు పెట్టుకున్న అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
అధికారులు దరఖాస్తులను పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా 4.6 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిసింది. వారికి పింఛన్లు ఎప్పటినుంచి అందిస్తామనే దానిపై సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 16న ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని కొందరు కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను అట్టహాసంగా ప్రారంభించారు. పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా అర్హులైన వారందరికీ దసరా పండుగనాడు పింఛన్లు పంపిణీ చేస్తామని వనదేవతల సాక్షిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీతో రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం 5.95 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.
వీటిలో పరిశీలన పూర్తి చేసి 4.6 లక్షల మందిని అర్హులుగా అధికారులు నిర్ధారించారు. వీరిలో వితంతువులు 2.5 లక్షల మంది, దివ్యాంగులు లక్ష మందికిపైగా, ఒంటరి మహిళలు 50 వేలు, గీత కార్మికులు 30 వేలు, నేతన్నలు (చేనేత) 7 వేల మంది ఉన్నట్టు తెలిసింది. అర్హుల గుర్తింపు పూర్తయి, జాబితా సిద్ధంగా ఉన్నప్పుడు పింఛన్ల పంపిణీపై సర్కార్ మీనమీషాలు లెక్కంచడంపై పేదల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతున్నది.
లబ్ధిదారుల జీవనంపై ప్రతికూల ప్రభావం
రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 44 లక్షల మందికి చేయూత పింఛన్లు అందుతున్నాయి. వీరిలో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులు ఉండగా, వారికి ప్రతినెలా రూ.4,016 అందజేస్తున్నారు. మిగిలిన వారికి నెలకు రూ.2,016 ఇస్తుండగా, వీరందరి కోసం ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నది. సీఎం ప్రకటించిన మాదిరిగా అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు కొత్త పింఛన్లు అందాల్సి ఉన్నది. కొత్తగా పింఛన్లు మంజూరు ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఏడాదికి సుమారు రూ.1,000 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేశారు.
అయితే, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ ఆర్థికసాయం మాత్రమే కాదు.. నిత్యావసరాలు, మందుల కొనుగోలుకు అదే ప్రధాన ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం వారి జీవనంపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే పింఛన్ కోసం అర్హులైన లబ్ధిదారులు నాలుగైదుసార్లు దరఖాస్తులు సమర్పించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ, లబ్ధిదారుల చేతికి పింఛన్ అందకపోవడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా జాప్యానికి గల కారణాలను వెల్లడించి, కొత్త పింఛన్ల పంపిణీకి స్పష్టమైన తేదీ ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Comments (0)