USA-Brazil : 'ట్రంప్ ఏమీ ప్రపంచ చక్రవర్తి కాదు', బ్రెజిల్ అధ్యక్షుడు..!

Sep 19, 2025 - 14:12
Sep 19, 2025 - 14:14
 0  3
USA-Brazil : 'ట్రంప్ ఏమీ ప్రపంచ చక్రవర్తి కాదు', బ్రెజిల్ అధ్యక్షుడు..!
ఐక్యరాజ్య సమితిలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా

ట్రంప్, బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లు విధించారు. రెండు దేశాల మధ్య చర్చల తర్వాత ట్రంప్ ఈ టారిఫ్‌లను తగ్గిస్తారని ఆశించారు.బ్రెజిల్‌తో అమెరికాకు వాణిజ్య మిగులు ఉన్నప్పటికీ, ట్రంప్ జులైలో బ్రెజిల్ వస్తువులపై 50 శాతం టారిఫ్‌ విధించారు.బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు, రైట్ వింగ్ నేత అయిన జైర్ బోల్సోనారోపై 'తిరుగుబాటు కుట్ర' కేసు విచారణ జరుగుతుండటమే దీనికి కారణమని ఆయన అన్నారు.

బ్రెజిల్‌తో సంబంధాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న తప్పులకు అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని లూలా అన్నారు.ట్రంప్, లూలా నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.ట్రంప్‌కు నేరుగా ఎందుకు ఫోన్ చేయలేదని, ఆయనను సంప్రదించడానికి ఎందుకు ప్రయత్నించలేదని లూలాను అడిగినప్పుడు, ''ఆయన ఎప్పుడూ మాట్లాడాలని అనుకోలేదు.

అందుకే నేను కూడా ఎప్పుడూ ఫోన్ చేయలేదు'' అని బదులిచ్చారు.లూలా కావాలంటే ఎప్పుడైనా తనకు ఫోన్ చేయవచ్చని గతంలో ట్రంప్ అన్నారు.కానీ, ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులకు మాట్లాడటమే ఇష్టం లేదని లూలా అన్నారు.అమెరికా టారిఫ్‌ల గురించి తనకు బ్రెజిల్ వార్తాపత్రికల ద్వారా తెలిసిందని బీబీసీతో లూలా అన్నారు.అమెరికా గత అధ్యక్షులు, బ్రిటన్ ప్రధాన మంత్రులు, యూరప్, చైనా, యుక్రెయిన్, వెనిజులా ఇలా ప్రపంచంలోని అన్ని దేశాలతో తాను సంబంధాలు కొనసాగించానని లూలా అన్నారు.

ఈ ఏడాది రష్యాలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం వార్షికోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు హాజరయ్యారు. పుతిన్‌తో తన సంబంధాలను ఆయన తెంచుకోలేదు.ట్రంప్‌, పుతిన్‌లలో ఎవరితో మీ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని అడిగినప్పుడు, పుతిన్‌తో తన బంధాన్ని ఆయన సమర్థించుకున్నారు.''ఈ సంబంధం ఈరోజుది కాదు. నేను, పుతిన్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచే మా బంధం కొనసాగుతోంది.

 ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నేను అధ్యక్ష పదవిలో లేను. అందుకే ట్రంప్‌తో పెద్దగా నాకు సంబంధాలు లేవు. ట్రంప్‌కు బోల్సోనారోతో సంబంధం ఉంది, బ్రెజిల్‌తో కాదు'' అని లూలా అన్నారు.వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్‌ తనకు ఎదురుపడితే ఆయనను పలకరిస్తానని లూలా చెప్పారు.'ఎందుకంటే, నేనొక నాగరికుడిని.

 ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావొచ్చు. కానీ, ప్రపంచానికి చక్రవర్తి కాదు' అని అన్నారు.బ్రెజిల్ సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు బోల్సోనారోను తిరుగుబాటు కుట్రలో దోషిగా నిర్ధరించారు.ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు ఆయనకు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.బోల్సోనారో, ఆయన స్నేహితులు కలిసి దేశానికి హాని చేశారని, తిరుగుబాటుకు ప్రయత్నించారని, తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని బీబీసీతో లూలా చెప్పారు.

'బోల్సోనారోపై దౌర్జన్యం జరుగుతోందని, బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యం లేదని ట్రంప్ అన్నారు. ఆయన అబద్ధాలు సృష్టిస్తున్నారు' అంటూ విమర్శించారు.''ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు నిర్ణయాలపై వీటో అధికారం ఉంది.

 ఇది అధికార సమతుల్యాన్ని మార్చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాల పక్షాన మొగ్గుతుంది. కోట్లాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్, ఆఫ్రికా ఇందులో భాగం కావడం లేదు.చైనా, రష్యాలతో తమ కూటమిని లూలా సమర్థించుకున్నారు.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిందని, అయినప్పటికీ రష్యా నుంచి బ్రెజిల్ చమురు కొనుగోలు చేస్తోందని అడిగినప్పుడు.. యుక్రెయిన్‌పై దాడిని ఖండించిన మొదటి దేశాల్లో బ్రెజిల్ కూడా ఉందని ఆయన చెప్పారు.ఐక్యరాజ్యసమితి సరిగ్గా పని చేసి ఉంటే యుక్రెయిన్, గాజా యుద్ధాలు జరిగేవి కాదని అన్నారు. ఇవి ''యుద్ధాలు కాదు, మారణహోమాలు'' అని ఆయన అభివర్ణించారు.

Rasipogula Gopal Editor-in-Chief