Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!

19 October 2026 - 22:15
0 0
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Elon Musk

Elon Musk | ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి వచ్చే ఏడాది స్పేస్‌ఎక్స్‌లో ఒక షేర్‌ ఇస్తానని ప్రకటించారు. సోమవారం తన ఎక్స్‌ (X) ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ షేర్ల పంపిణీ ఎలా జరుగుతుంది? ఏ వయసు పిల్లలకు ఇస్తారు? అర్హతలు ఏమిటి? వంటి వివరాలను మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.

కృత్రిమ మేధ (AI) రంగంలో పనిచేస్తున్న ఆంత్రోపిక్‌ సంస్థ తన షేర్లలో కనీసం ఐదు శాతాన్ని ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేసే నిధికి కేటాయించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రైవేట్‌ కంపెనీగా దాని తాజా విలువ ఆధారంగా ఈ వాటా సుమారు 48 బిలియన్‌ డాలర్లకు సమానం. లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు ఇవ్వడం, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి సహాయం చేయడం వంటి కార్యక్రమాలకు ఈ నిధిని వినియోగించే అవకాశం ఉంది.

అయితే ఈ ప్రకటనకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. షేర్లను నేరుగా ప్రజలకు ఇవ్వడం మంచిదని వ్యాఖ్యానించారు. తాను కూడా అదే విధంగా చేయనున్నట్లు తెలిపారు. మస్క్‌ ప్రకటన ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, దాని అమలుపై ఇంకా వివరాలు వెలువడలేదు.

అమెరికా జనాభా లెక్కల సంస్థ వివరాల ప్రకారం.. ఆ దేశంలో 18 ఏళ్లలోపు వారు సుమారు 7.3 కోట్ల మంది ఉన్నారు. స్పేస్‌ఎక్స్‌ షేరు ధర సుమారు 146 డాలర్లుగా పరిగణిస్తే, ప్రతి చిన్నారికి ఒక్కో షేర్‌ ఇవ్వడానికి దాదాపు 10.7 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు రూ.90 వేల కోట్లకు పైగా విలువైన షేర్లు అవసరమవుతాయి. అయితే ఈ అంచనా ప్రస్తుత షేరు ధర ఆధారంగా మాత్రమే. వాస్తవంగా ఎంతమందికి షేర్లు ఇస్తారు, వాటి విలువ ఎంత ఉంటుందనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికాలోని కోట్లాది మంది పిల్లలకు షేర్లను ఏ విధంగా బదిలీ చేస్తారు? మైనర్ల పేరిట ప్రత్యేక పెట్టుబడి ఖాతాలు ఏర్పాటు చేస్తారా? అందరికీ సమానంగా అందిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

Comments (0)

User