AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!

AP News : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుపానుగా బలపడిందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ తుపానుకు ఇప్పటికే ఆర్నబ్ తుపాను (Cyclone Arnab) అని నామకరణం చేశారు. ఈ ‘అర్నబ్’ తుపాను ఇప్పుడు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తున్నది. గడిచిన 6 గంటలలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరంవైపు కదిలిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉందని వెల్లడించారు. సోమ, మంగళ, బుధవారాలలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Comments (0)