బిగ్ బాస్ తెలుగు: 15 మంది కంటెస్టెంట్స్ వీళ్లే, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్‌తో ప్రారంభమైన 9వ సీజన్..!

ఈసారి కంటెస్టెంట్లలో 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. నటుడు నాగార్జున మరోసారి బిగ్‌బాస్ హోస్ట్‌గా వచ్చారు.
స్టార్‌మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ఈసారి డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని నాగార్జున చెప్పారు.
ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సీజన్లో ఒక ఇంట్లో సెలబ్రిటీలు, మరో ఇంట్లో సామాన్యులు ఉంటారు. సామాన్యుల్ని ఎంపిక చేసేందుకు 'అగ్ని పరీక్ష' అనే ప్రీ షో నిర్వహించారు.
సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ, సుమన్ షెట్టి, రీతూ చౌదరి, శ్రష్టి వర్మ, ఇమ్మాన్యుయేల్... సినీ నటులు, సెలబ్రిటీలు సహా కొందరు సామాన్యులతో కలిపి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది.
ఫ్లోరా సైనీ: ఆశా సైనీగా తెలుగువారికి బాగా పరిచయమైన నటి.
'నరసింహ నాయుడు' సినిమాలో హీరోయిన్ సోదరి పాత్రలో కనిపించిన ఆశా సైనీ, ఆ సినిమాలో 'లక్స్ పాప' అనే పాపులర్ సాంగ్‌లో బాలకృష్టతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత కూడా సైనీ అనేక సినిమాల్లో నటించారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు నాగార్జున ఆమెను ఆశా సైనీ అని పిలవగా తన పేరు 'ఫ్లోరా సైనీ' అని ఆమె చెప్పారు.
ఇమ్మాన్యుయేల్: బిగ్‌బాస్ హౌస్‌లోకి నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు.
ఆయన అనేక టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇమ్మాన్యుయేల్ స్టాండప్ కమెడియన్ కూడా.
హరిత హరీశ్: ఆరో కంటెస్టెంట్‌గా సామాన్యుల కేటగిరీ నుంచి హరిత హరీశ్ ప్రవేశం దక్కించుకున్నారు.
అగ్నిపరీక్ష జ్యూరీ మెంబర్ అయిన బింధు మాధవి ఆయన పేరును ఎంపిక చేశారు. జీవితంలో తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు బిగ్‌బాస్ ఊరటనిచ్చిందని హరీశ్ చెప్పారు.
రీతూ చౌదరి: బిగ్‌బాస్ హౌస్‌లోకి 8వ కంటెస్టెంట్‌గా 'జబర్దస్త్' ఫేమ్ రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చారు.
ఇన్నాళ్లు పలు షోలు, ప్రోగ్రామ్స్ ద్వారా రీతూ పాపులర్ అయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
సంజనా గల్రానీ: ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో పాపులర్ అయిన సంజన, కన్నడ నటి. తెలుగులో అనేక సినిమాల్లో నటించారు.
2020 సెప్టెంబర్ 8న బెంగళూరు డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అయ్యారు.
ఈ కేసులో మూడు నెలలు జైలులో ఉన్నారు. హౌస్‌లోకి పదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు.