తెలుగు భాషా దినోత్సవం: గిడుగు వెంకటరామమూర్తి తెలుగు వాడుక భాష కోసం కృషి ..!

Aug 29, 2025 - 10:41
Aug 29, 2025 - 10:41
 0  1
తెలుగు భాషా దినోత్సవం: గిడుగు వెంకటరామమూర్తి తెలుగు వాడుక భాష కోసం కృషి ..!

గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు.

గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆయన జయంతినాడు (ఆగస్ట్ 29) మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.

గిడుగు జీవితకాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించింది. వాటిలో ప్రధానంగా నాలుగు విభాగాల గురించి వివరించవలసి ఉంటుంది.

మొదటిది ఆయన ముప్పయ్యేళ్ళకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేసారు. పర్లాకిమిడి మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, పాఠశాలల పరీక్షకుడిగా, పర్యవేక్షణాధికారిగా పనిచేసారు. 1813లో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు తెరిచారు.

అప్పటినుంచి 1835 దాకా పాతికేళ్ళ పాటు భారతదేశంలో విద్యపట్ల ఈస్టిండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. కొందరు ప్రాచీన భాషలైన సంస్కృతం, పారశీకాల్లో విద్యాబోధన జరగాలన్నారు. వాళ్ళని ఓరియెంటలిస్టులు అంటారు. కొందరు ఇంగ్లీష్‌లో విద్యాబోధన జరగాలని వాదించారు. వారిని ఆంగ్లిసిస్టులు అంటారు.

ఈ చర్చను ముగిస్తూ మెకాలే 1835లో ఒక నిర్ణయం ఒక ప్రకటించారు. తరువాత ఆ మినిటు ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనావ్యవస్థను ఏర్పాటు చేస్తూ సర్ ఛార్లెస్ వుడ్ 1854లో ఆదేశాలు విడుదల చేసారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు.

1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.

1913 నాటికి, అంటే, మిషనరీలు ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలు తెరిచిన వందేళ్ళకు సవరమాధ్యమంలో పుస్తకాలూ, పాఠశాలలూ తెరిచారు గిడుగు. కాని అప్పుడు భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గిడుగు ఆ వాచకాలు బాగున్నాయిగాని, వాటిని తెలుగు లిపిలో రాయడంవల్ల ప్రయోజనం లేదని చెప్పారు.

తెలుగు లేదా ఒరియా లిపి వాడటంకన్నా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఆ విధంగా గిరిజన భాషామాధ్యమంలో ఒక పాఠశాల తెరవడంలోనూ, వాచకాలు రూపొందించడంలోనూ, వారి విద్య గురించి ఆలోచించడంలోనూ భారతదేశంలో గిడుగునే మొదటివాడు. అందుకని మనం ఆయన్ని భారతదేశంలో మొదటి ఆంత్రొపాలజిస్టు అనవచ్చు.

దాంతో 1913 నాటికి సవర భాషలో తన కృషి పూర్తయిందనుకున్న గిడుగు ఆ రోజు నుంచే తన కృషి నిజంగా మొదలు పెట్టారు. అప్పటినుంచీ మరొక ఇరవయ్యేళ్ళు అపారమైన కృషి చేసి 1931లో మాయువల్ ఆఫ్ సోర లాంగ్వేజ్ నీ, 1933 ల ఇంగ్లీషు-సోర నిఘంటువునీ వెలువరించారు.

 భాషా శాస్త్రంలోనూ, ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేపట్టిన ఈ అద్వితీయమైన కృషి వల్ల ఆయన్ని నేడు గొప్ప భాషాశాస్త్రవేత్త అనీ, కాలం కన్నా ముందున్న భాషావేత్త అని అంతర్జాతీయ స్థాయి లింగ్విస్టులు ప్రశంసిస్తున్నారు.

అప్పటిదాకా పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు, రాసిన పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కూడా ఒక కృతక గ్రాంథికంలో నడుస్తున్నాయనీ, వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించారు.

 ప్రామాణిక భాషగా చెప్పుకుంటున్న పండితుల భాష జీవరహితమైన ఒక కృతక భాష అని చెప్పడానికి, వారి పుస్తకాలనుంచే ఉదాహరణలు ఎత్తిచూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చెయ్యవలసి వచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా 'బాలకవి శరణ్యము', 'ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము', గద్యచితామణి' వంటి రచనలు చేపట్టారు. ఆ పుస్తకాల్లో వెలిబుచ్చిన భావాల సారాంశంగా 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు.

గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.

ఇక గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన, చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే. శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరిదాకా కొనసాగుతూనే వచ్చింది. ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన, చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారని చెప్పాలి.

గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవవల్ల తెలుగు అకాడమీ 2014-2016 లో రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది. ఆ రచనలమీద సమగ్ర అధ్యయనం ఇంకా మొదలుకావలసి ఉంది.