కోర్టులో లొంగిపోయిన సీఐడీ మాజీ డీజీ సంజయ్, ఈయనపై ఉన్న కేసులు ..!
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సంజయ్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
సీఎస్ నీరబ్ కుమార్ నుంచి అనుమతి లభించడంతో సంజయ్‌తో పాటు హైదరాబాద్‌లోని క్రిత్వ్‌యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఐడీ డీజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మంగళవారంకోర్టులో లొంగిపోయారు.
ఏసీబీ కోర్టు ఆయనకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సంజయ్‌ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
రూ.1.75 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఏసీబీ గతేడాది చివర్లో సంజయ్‌పై కేసు నమోదు చేసింది.
ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే నాలుగువారాల్లోగా విచారణ అధికారులకు లొంగిపోవాలని జూలై 31న సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గడువు ముగిసే ముందు ఆగస్టు 26న ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
సెప్టెంబర్ 9వరకు రిమాండ్ విధించడంతో సంజయ్ బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేయగా, ఆయన్ని వారంరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. రెండు పిటిషన్లలో కౌంటర్ దాఖలకు ఆదేశాలిచ్చిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగాధిపతిగా, అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ రూ.1.75 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చింది.
కాంట్రాక్టును అప్పగించిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే గిరిజనుల పేరిట నిర్వహించిన సదస్సుల కోసం రూ. 59.51లక్షలు, దళితుల కోసం ఉద్దేశించిన సదస్సులకు రూ. 59.52 లక్షలు... మొత్తం రూ. కోటి 19లక్షల 3వేల రూపాయలు బిల్లు చెల్లించారు.
అయితే క్రిత్వ్‌యాప్ టెక్నాలజీస్‌తో సంబంధం లేకుండా ఆ సదస్సులను కేవలం సీఐడీ ప్రాంతీయ కార్యాలయాల్లోనే మొక్కుబడిగా నిర్వహించి.. రూ.1.19కోట్లను దుర్వినియోగం చేశారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది.
ఆ రెండు ప్రైవేటు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) రెడ్ విత్ 13( 2) సెక్షన్ 7 తో పాటు ఐపీసీ 420, 409, 477ఎ, 120బీ సెక్షన్ల కింద సంజయ్‌పై ఏసీబీ అభియోగాలు మోపింది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై సదస్సులు నిర్వహించడం ద్వారా దళితులు, గిరిజనులకు అవగాహన కలిగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ మేరకు సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును హైదరాబాద్‌లోని క్రిత్వ్‌యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంజయ్ సీఐడీ విభాగాధిపతిగా ఉన్న సమయంలో అప్పగించారు.
క్రిత్వ్‌యాప్ టెక్నాలజీస్ సంస్థ.. ప్లాట్ నెంబర్ 601. లలితాంజలి అపార్ట్‌మెంట్, ద్వారకాపురి కాలనీ, హైదరాబాద్.. చిరునామాలో ఉన్నట్టు రికార్డుల్లో చూపించారు.
కానీ అసలు ఆ చిరునామాలో అలాంటి కంపెనీనే లేదని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది.
దీన్ని బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ అదే చిరునామా ఉంది.
అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) ఆన్‌లైన్‌లో జారీ చేయడంతో పాటు అగ్ని–ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లను డెవలప్ చేయడంతో పాటు నిర్వహించడం. 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్ అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న హయాంలోనే అప్పగించారు.
ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి పనులు జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల రూపాయల బిల్లులు చెల్లించేశారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది.
పైగా సౌత్రిక టెక్నాలజీస్‌తో 2023 ఫిబ్రవరి 15న ఒప్పందం చేసుకోగా. పనులేనీ జరక్కుండానే కేవలం వారం వ్యవధిలోనే అంటే 2023 ఫిబ్రవరి 22న ఆ సంస్థకు 59.33 లక్షల బిల్లులు చెల్లించారని విజిలెన్స్ అభియోగాలు మోపింది.
సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, క్రిత్వ్‌యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమ అయిన డబ్బును ఎవరు విత్‌డ్రా చేశారు?
అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది.
కాగా, క్రిత్వ్‌యాప్ టెక్నాలజీస్. సౌత్రికా టెక్నాలజీస్ ఈ రెండూ ఒకే అడ్రస్‌లో ఆఫీసులు పెట్టినట్టు చూపించారనీ, అసలు ఆ రెండింటి మధ్య సంబంధం ఏమిటి.. నిధులు ఎలా పక్కదారి పట్టించారనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని ఏసీబీ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
కేసు విచారణ దశలో ఉన్నప్పుడు ఇంతకుమించి వివరాలు చెప్పలేమన్నారు.
దళిత, గిరిజనులకు అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగించే ప్రాజెక్టును తాము సరిగ్గానే చేశామని క్రిత్వ్‌యాప్ సంస్థ డైరెక్టర్ వినయ్‌కుమార్ బీబీసీకి తెలిపారు.
ఈ విషయమై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. తమ ఆఫీసు కూడా ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉందని, విజిలెన్స్ అధికారులు అక్కడికి వచ్చి విచారణ కూడా చేశారని చెప్పారు.
అయితే ఆ ఆఫీసు అక్కడ లేదని ఎందుకు పేర్కొన్నారో తమకు తెలియదని వినయ్ వ్యాఖ్యానించారు."అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని–ఎన్వోసీ వెబ్‌సైట్‌ను మేమే రూపొందించాం. మొబైల్ యాప్‌లను డెవలప్ చేయడంతో పాటు దాదాపు 18లక్షల విలువైన సర్ఫేస్ ప్రో పరికరాలను ఇచ్చాం. నిజాయతీగా టెండర్ దక్కించుకున్నాం. ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదు. కానీ సంజయ్ కుమార్‌తో పాటు మాపై కేసులు ఎందుకు పెట్టారో అర్ధం కావడం లేదు" అని సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ గ్లోబల్ సీఈవో కొండలరావు బీబీసీతో అన్నారు.
తమ సంస్థపై ఏసీబీ కేసు పెట్టడంపై ఆయన స్పందిస్తూ
"తాము దక్కించుకున్న టెండర్ పని విలువ 2కోట్ల 29లక్షలని, చేసిన 40శాతం పనికి గానూ 59లక్షలు చెల్లించారని, ఇందులో మోసం, నేరం ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు విచారణకు వస్తే తమ వద్ద ఉన్న అన్ని రుజువులు, ఆధారాలు సమర్పిస్తామని" తెలిపారు.
ఇప్పటికీ ఫైర్ వెబ్‌సైట్ క్లౌడ్ సర్వీసుల్లోనే ఉందని కొండలరావు తెలిపారు.
సౌత్రికా, క్రిత్వ్‌యాప్ సంస్థల అడ్రస్ ఒకటేనని అంటున్నారనీ, అందులో తప్పేముందని కొండలరావు ప్రశ్నించారు.
కో వర్కింగ్ స్పేస్ మోడల్‌లో ఎన్నో ఆఫీసులు అలానే ఉంటున్నాయి కదా అని ఆయన అన్నారు.