‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’

– బీఆర్ఎస్వీ ఎంజీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, అక్టోబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం జీఓ నంబర్ 142 ద్వారా చేపట్టనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం అన్యాయమని బీఆర్ఎస్వీ ఎంజీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాడపల్లి నవీన్ విమర్శించారు. ఎంజీయూకు అధ్యాపక పోస్టులు కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న అధ్యాపకుల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలతో సమానంగా ఎంజీయూకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
విశ్వవిద్యాలయానికి అవసరమైన అధ్యాపక పోస్టుల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో వైస్‌ఛాన్సలర్ చొరవ చూపడం లేదని నవీన్ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్, విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎంజీయూలోని వివిధ విభాగాల్లో అధ్యాపకుల అవసరాలను గుర్తించి, తగిన సంఖ్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. విశ్వవిద్యాలయానికి న్యాయంగా దక్కాల్సిన పోస్టుల సాధన కోసం విద్యార్థి సంఘం తరఫున పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని వాడపల్లి నవీన్ హెచ్చరించారు.
Comments (0)