'ఆ పుర్రె మహిళది కాదు, పురుషుడిది': ధర్మస్థల కేసులో ట్విస్ట్, ఫిర్యాదు చేసిన వ్యక్తి అరెస్ట్...!

Aug 25, 2025 - 10:24
Aug 25, 2025 - 10:25
 0  2
'ఆ పుర్రె మహిళది కాదు, పురుషుడిది': ధర్మస్థల కేసులో ట్విస్ట్, ఫిర్యాదు చేసిన వ్యక్తి అరెస్ట్...!

కర్ణాటకలోని ధర్మస్థల పట్టణం, దాని చుట్టుపక్కల వందలాది మంది బాలికలు, మహిళలు, పురుషులను ఖననం చేసినట్లు చెప్పిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది.

ధర్మస్థల కేసులో గత కొన్నిరోజుల విచారణ తర్వాత, సిట్ ఆయనను అరెస్టు చేసింది.

"ఆయన తెచ్చిన పుర్రె, ఎముక అవశేషాలు మృతదేహాలను పాతిపెట్టినట్లు పేర్కొన్న ప్రదేశాల నుంచి తీసుకురాలేదు" అని ఒక అధికారి తెలిపారు.

ఆ వ్యక్తి మహిళ పుర్రెగా సమర్పించినది, వాస్తవానికి ఒక పురుషుడిదని మరో అధికారి చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుడు తెచ్చిన పుర్రె పురుషుడిదిగా ఫోరెన్సిక్ పరీక్ష తేల్చింది.

సెక్షన్ 229, బీఎన్ఎస్ ప్రకారం..

"న్యాయ విచారణలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చినా, లేదా న్యాయ విచారణలో ఏ దశలోనైనా ఉపయోగించుకోవడానికి తప్పుడు సాక్ష్యాలను కల్పించినా, వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పది వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది."

''సబ్-సెక్షన్ (1)లో పేర్కొన్న కేసు కాకుండా, మరే ఇతర కేసులోనైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చినా లేదా కల్పించినా, వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, ఐదు వేల రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు. ''

తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు ఈ వ్యక్తిని అరెస్టు చేసినట్లు 'ధర్మస్థల కేసు'పై దర్యాప్తు చేస్తున్న సిట్ వర్గాలు బీబీసీకి తెలిపాయి. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం, పది రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు.

ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు 'ధర్మస్థల కేసు'లో మొదట ఫిర్యాదుదారుగా, సాక్షిగా పోలీసుల ముందు హాజరయ్యారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 183 కింద న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం కూడా ఇచ్చారు. అనంతరం, ఆయనకు 'సాక్షి రక్షణ చట్టం' కింద రక్షణ కూడా కల్పించారు.

తన ఆరోపణలను బలపరచడానికి, ఒక పుర్రె, ఎముకల అవశేషాలను కూడా మేజిస్ట్రేట్ ముందు సమర్పించారాయన. వీటితో, పారిశుద్ధ్య కార్మికుడు తన వాదనలు నిజమని నిరూపించుకోవడానికి ప్రయత్నించారు.జూలై 3న ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన తల నుంచి కాలి వరకు నల్లని ముసుగు ధరించారు. విచారణలో భాగంగా మృతదేహాలను పాతిపెట్టినట్లు పేర్కొన్న 17 ప్రదేశాలకు సిట్ ఆయన్ను తీసుకెళ్లింది.

వీటిలో, ఆరవ, పదకొండవ ప్రదేశాల సమీపంలో "కొన్ని అస్థిపంజర అవశేషాలు" కనుగొన్నారు. 13వ ప్రదేశంలో భూగర్భంలో పరిశీలించడానికి గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్‌(జీపీఆర్)ను ఉపయోగించారు, కానీ, అక్కడ ఏమీ దొరకలేదు.

ఈ ఏడాది జూలై 3న, ఒక గుర్తుతెలియని విజిల్‌బ్లోయర్ 1995, 2014 మధ్య కర్ణాటకలోని మతపరమైన స్థలమైన ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినట్లు, ఆ సమయంలో ఒక పలుకుబడి కలిగిన కుటుంబం, వారి ఉద్యోగుల ఆదేశాల మేరకు ఇక్కడ వందలాది మృతదేహాలను ఖననం చేసినట్లు ఆరోపించారు.

ఖననం చేసిన మృతదేహాలలో "దుస్తులు లేకుండా, లైంగిక హింస, దాడికి సంబంధించిన స్పష్టమైన గుర్తులున్న" అనేక మంది మహిళల శరీరాలున్నాయని ఆరోపించారు. ఈ విషయం గురించి పోలీసులకు చెబుదామంటే, ఉన్నతాధికారులు వద్దనేవారని, మాట వినకపోతే చంపేస్తామని బెదిరించారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో, ఈ కేసును దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం జూలై 19న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుడి సహాయంతో గుర్తించిన 13 ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టే పనిని ఈ బృందానికి అప్పగించారు.కర్ణాటకలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ గతవారం బెంగళూరు నుంచి ధర్మస్థల వరకు కార్ ర్యాలీని నిర్వహించింది. హిందూ మతపరమైన ప్రార్థనా స్థలానికి "నష్టం కలిగించే ప్రచారానికి" నిరసనగా దీన్ని చేపట్టినట్లు పేర్కొంది.

శ్రీ క్షేత్ర మంజునాథస్వామి ఆలయ ధర్మాధికారి, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్గడెను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ఎమ్మెల్యేలు కలిసి సంఘీభావం తెలిపారు.

'ఫిర్యాదుదారు-సాక్షి' ఆరోపణలు నిరాధారమైనవని వీరేంద్ర హెగ్గడె బీబీసీతో చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం వివిధ రంగాలలో విశేషమైన సేవలందించిన సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యమని ఆరోపించారు.

కాగా, సిట్ విచారణను ఎంపీ స్వాగతించారు.

"మేం దర్యాప్తుకు పూర్తి మద్దతు ఇచ్చాం. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థ, భారత రాజ్యాంగంపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఎంపీ వీరేంద్ర హెగ్గడె అన్నారు.