Smartphone Sales | పండుగ సీజన్‌లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!

30 October 2026 - 14:28
0 0
Smartphone Sales | పండుగ సీజన్‌లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Tv Smartphone Festive Seaso

Smartphone Sales | దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల వేళ.. కొత్త మొబైల్‌ ఫోన్‌ కొనాలని, ఇంట్లో టీవీ మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. ఈ సమయంలో కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పండగల సీజన్‌లోనూ స్మార్ట్‌ఫోన్లు, టీవీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో తయారీ సంస్థలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో ఉత్పత్తిని ఎప్పటితో పోలిస్తే 20 శాతం వరకు తగ్గించాలని భావిస్తున్నాయి. మరోవైపు మార్కెట్లో అమ్ముడుపోని స్టాక్‌ పేరుకుపోవడం కంపెనీలకు కొత్త సవాలుగా మారింది.

20 శాతం వరకు తగ్గనున్న ఉత్పత్తి!

ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. మొబైల్‌ ఫోన్లు, టీవీల తయారీ సంస్థలు వచ్చే రెండు మూడు నెలల్లో ఉత్పత్తిని ప్రణాళికాబద్ధమైన స్థాయితో పోలిస్తే 20 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ పండగ సీజన్‌లో గత ఏడాదితో పోలిస్తే యూనిట్ల వారీగా అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

సాధారణంగా పండగల సమయంలో డిమాండ్‌ భారీగా ఉంటుందనే అంచనాతో కంపెనీలు ముందుగానే పెద్ద మొత్తంలో ఉత్పత్తులను తయారు చేస్తాయి. రిటైల్‌ దుకాణాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు సరిపడా స్టాక్‌ పంపిస్తాయి. కానీ ఈసారి వినియోగదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులే అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. దీంతో కొత్తగా తయారు చేసే ఉత్పత్తుల సంఖ్యను తగ్గించి, పాత స్టాక్‌ను విక్రయించడంపై కంపెనీలు దృష్టి పెట్టనున్నాయి.

పండగల సీజన్‌లో 25 శాతం తగ్గిన అమ్మకాలు

మొబైల్‌ ఫోన్లు, టీవీల వ్యాపారానికి ఓనం నుంచి దీపావళి వరకు ఉండే సమయం చాలా కీలకం. ఏడాది మొత్తం అమ్మకాల్లో ఈ పండగల సీజన్‌ వాటా సుమారు 30 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా. అలాంటి కీలక సమయంలోనే ఈసారి అమ్మకాలు దాదాపు 25 శాతం తగ్గడం తయారీ సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదే సమయంలో 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య కూడా స్మార్ట్‌ఫోన్లు, టీవీల యూనిట్‌ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 10 శాతానికి పైగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. పండగల సీజన్‌లో అమ్మకాలు పెరిగి ఈ నష్టాన్ని భర్తీ చేస్తాయని కంపెనీలు ఆశించాయి. కానీ డిమాండ్‌ పుంజుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

కస్టమర్లలో ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది?

అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో వినియోగదారుల కొనుగోలు ఆసక్తి మందగించడం ఒకటి. దీనికి తోడు మెమరీ చిప్‌ల ధరలు పెరగడం కూడా ప్రభావం చూపుతోంది. చిప్‌ల ధరల పెరుగుదలతో తయారీ వ్యయాలు అధికమవుతున్నాయి. ఫలితంగా కొన్ని మొబైల్‌ ఫోన్లు, టీవీల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు కొత్త ఫోన్‌ లేదా టీవీ కొనుగోలును వాయిదా వేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్‌ తగ్గి, రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద అమ్ముడుపోని ఉత్పత్తుల నిల్వలు పెరుగుతున్నాయి.

ఇక ఫోన్లు, టీవీల ధరలు తగ్గుతాయా?

ఉత్పత్తిని తగ్గిస్తున్నాయనే కారణంతో వెంటనే మొబైల్‌ ఫోన్లు, టీవీల ధరలు పెరుగుతాయని లేదా తగ్గుతాయని చెప్పలేం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాక్‌, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌, కంపెనీల ధరల విధానంపై ఇది ఆధారపడి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అమ్మకాలు ఇలాగే మందకొడిగా కొనసాగితే పాత స్టాక్‌ను విక్రయించేందుకు కంపెనీలు, రిటైలర్లు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Comments (0)

User